వియ్యంకుడు బాటలో పొంగూరు..?

Date:6/08/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరుకు చెందిన నారాయ‌ణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయ‌ణ రాజ‌కీయ జీవితంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ మాటేంటి ? ఎలా ఉంటుంది? నారాయ‌ణ ఎలా ముందుకు సాగుతారు ? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబుకు న‌మ్మిన‌బంటు. ఈ విష‌యంలో సందేహంలేదు. 2014కు ముందు చంద్రబాబు నిర్వ‌హించిన వ‌స్తున్నా మీకోసం యాత్రకు సంబంధించి ఆయ‌న ఆర్థికంగా సాయం చేశార‌నే వాద‌న ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చాక‌.. నారాయ‌ణ‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.అటు నుంచి నారాయ‌ణ‌ను మంత్రిని చేశారు. అంతేకాదు, కీల‌క‌మైన సీఆర్‌డీయే బాధ్యత‌లు అప్పగించారు. అదేవిధంగా రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించిన కీల‌క బాధ్యత‌ల‌ను కూడా నారాయ‌ణ చేతిలోనే పెట్టారు. దీంతో చంద్రబాబు త‌ర్వాత మ‌హామేధావిగా నారాయ‌ణ అప్పటి ప్రభుత్వంలో గుర్తింపు పొందారు. అయితే, ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక కాక‌పోవ‌డం పెద్దవెలితిగా ఉండేది. ఆయ‌న మంత్రి ప‌ద‌వి రెండున్నరేళ్ల త‌ర్వాత తీసేస్తార‌న్న ప్రచారం జ‌రిగినా కూడా చంద్రబాబు మాత్రం ఐదేళ్ల పాటు కొన‌సాగించారు.

 

ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు రెండు సంవ‌త్సరాల నుంచి నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంపై త‌న‌దైన మార్కు వేసేలా అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధిని ప‌రుగులు పెట్టించారు.అయితే, అక్కడి యువ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ దూకుడుముందు మంత్రి నారాయ‌ణ నిలువ‌లేక పోయారు. దీంతో ఓడిపోయిన ఆయ‌న పార్టీలో మౌనంగా ఉంటున్నారు. ఇటీవ‌ల కాలంలో రాజ‌ధాని భూముల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న వైఎస్సార్ సీపీ స‌ర్కారు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న మ‌రింత సైలెంట్ అయ్యారు. ఇదెలాఉన్నప్పటికీ.. రాజ‌కీయంగా నారాయ‌ణ సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్నార‌నే చెప్పాలి. ఆయ‌న‌కు విద్యా వ్యాపారాలు ఉన్నాయి.

 

ఈనేప‌థ్యంలో వీటిని కాపాడుకోవాలంటే.. సైలెంట్‌గా ఉండ‌డ‌మే బెట‌ర‌నే ధోర‌ణి ఉంది.మ‌రి రాజ‌కీయంగా ఎలా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. మ‌రోపక్క, త‌న వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి జంప్ చేస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రి నారాయ‌ణ ఏం చేస్తారు. వియ్యంకుడి బాట‌లో ముందుకు వెళ్తారా? లేక‌.. త‌న‌కు విద్యాసంస్థలు చాలని ఉండిపోతారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం చేస్తారో చూడాలి. వాస్తవానికి నారాయ‌ణ వైసీపీ ఎంట్రీ వార్తలు గ‌త కొద్ది నెల‌లుగా వినిపిస్తున్నా ఆయ‌న మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. ఇప్పుడు స‌డెన్‌గా ఆయ‌న పార్టీ మార్పు వార్తలు రూమ‌ర్లుగా ఉండ‌గానే వియ్యంకుడు గంటా పార్టీ మార్పు వార్తలు స్పీడ్ అయ్యాయి.

 

 ఖరీఫ్ పై సన్నగిల్లుతున్న ఆశలు

Tags:Pongur on the way to Viyyankudu ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *