కలుషిత నీటితో రోగాన జనాలు

Date:19/08/2018
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరులో మంచినీరు కలుషితమై డయేరియా వచ్చిన మొద్దు నిద్ర వీడటం లేదు. నగరంలో ఇంకా పలు ప్రాంతాల్లో కలుషితనీరు సరఫరా అవుతూనే ఉంది. నీరు దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. నామమాత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పీహెచ్‌ వాల్యూను పరీక్షలు చేసి  చేతులు దులుపుకొంటున్నారు.
సంబంధిత ఏఈలు సైతం డివిజన్లలో లీకులు గుర్తించటం, పాడైపోయిన పైపుల స్థానంలో నూతన పైపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయటం వంటివి చేయడం లేదు. ఇక డివిజన్లలో యుజీడీ, సైడుకాల్వల ఏర్పాటుకు, ప్రైవేటు టెలికం సంస్థలు గుంతలు తీస్తున్నప్పుడు వారికి పైపులైన్లపై కనీస సమాచారం కానీ, క్షేత్రస్థాయిలో వారి పనులను పర్యవేక్షించటం కాని జరగటం లేదు. దీనివలనే ఎక్కువ ప్రాంతాల్లో పైపులకు లీకులు, మరమ్మతులు గురవుతున్నాయి.
కలుషిత నీరు తాగటం వలన చిన్నపిల్లలు, వృద్ధులు తరుచుగా రోగాల బారిన పడుతున్నారు. పైపులైను లీకులు గమనిస్తే వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, మురుగుకాల్వలో నుంచి వెళుతున్న మంచినీటి పైపులైనులు పక్కకు మార్చాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవేమీ అమలుజరగటం లేదు.
మురుగునీరు సరఫరాపై  స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఇంజినీరింగ్‌ అధికారులు సక్రమంగా స్పందించటం లేదు. పురసేవ, 103 ద్వారా వచ్చే ఫిర్యాదులకు సైతం నూతన పైపులైన్లు ఏర్పాటు చేస్తాం అని, పాత పైపులు కాబట్టి లీకులు అవుతున్నాయని సమాధానం ఇచ్చి ఫిర్యాదులను పరిష్కరించకుండానే క్లోజ్‌ చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.భయాందోళనతో రోజూ రూ.30 నుంచి 40 వెచ్చించి మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేస్తున్నామని నగరవాసులు వాపోతున్నారు.
యూజీడీ పైపులైన్ల కోసం తవ్విన గుంతలు నెలల తరబడి పూడ్చకపోవటంతో వాటిల్లో మురుగునీరు చేరి లీకుల ఉన్న పైపుల ద్వారా ఇళ్లలోకి కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయి. దీనితో పలు ప్రాంతాల్లో తరుచు కలుషిత నీరు సరఫరా అవుతుంది.పట్టాభిపురం ప్రాంతంలో సోమవారం మంచినీటి పైపులైన్లో ఎర్రమట్టి నీరు రావటంతో  స్థానికుల్లో కలకలం రేగింది.
ప్రతిరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇక్కడ నీరు సరఫరా అవుతుంది. తరుచుగా ఇక్కడ దుర్వాసన, మట్టితో కూడిన నీరు సరఫరా అవుతుండగా సోమవారం మాత్రం పూర్తిగా ఎర్రమట్టితో కూడిన నీరు సరఫరా అయింది. దాదాపు గంటన్నర వరకు పూర్తిగా మట్టినీరు వచ్చింది. స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేరు.
సమీప ప్రాంతంలో ఆదివారం కేబుల్‌ నెట్‌వర్క్‌ పనులు కోసం పైపులు ఏర్పాటు చేస్తుండగా పట్టాభిపురం 4వ లైనుకు మంచినీరు సరఫరా చేస్తున్న 90ఎంఎం డయా పైపులైను అడుగున్నర పైనే పగిలిపోయింది. ఈ విషయం ఇంజినీరింగ్‌ అధికారులు గమనించకుండా నీటిని విడుదల చేయటంతో కుళాయిల్లో ఎర్రమట్టి నీరు సరఫరా అయింది.నగరంలో నీటిసరఫరాపై ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు.
నగరంలోని శ్యామలానగర్, ఎస్‌వీఎన్‌ కాలనీ, పట్టాభిపురం, కేవీపీ కాలనీ, పాతగుంటూరు, ఐపీడీ కాలనీ, శివనాగరాజుకాలనీ, రాజీవ్‌గాంధీనగర్, గుంటూరువారితోట, శారదాకాలనీ, ముత్యాలరెడ్డి నగర్‌లోని చాలా వరకు ప్రాంతాల్లో కలుషితనీరు, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోందని తరుచుగా ఫిర్యాదులు అందుతున్నాయి.
Tags; Poor people with polluted water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *