మూడు రెట్లు పెరిగినట్టు పౌల్ట్రీ వర్గాలు

కాకినాడ ముచ్చట్లు:


మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోళ్ల రైతుల పరిస్థితి. ఎగుమతులకు ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ, పెరిగిన మేత ధరలతో కుదేలైన కోళ్ల పరిశ్రమను మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక రోజుకు దాదాపు లక్ష కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమకు రోజుకు రూ.2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా.తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకూ ఉండగా, మిగిలిన దశల్లోని కోళ్లు 1.2 కోట్ల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 23 వేల నుంచి 25 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తట్టుకుంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవడంతో కోళ్ల మరణాలు పెరగడంతో పాటు గుడ్లు ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధిక ఎండలతో కోళ్ల మరణాలు మూడు రెట్లు పెరిగినట్టు పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి.

 

 

జిల్లాలో ప్రస్తుతం రోజుకు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సగటున సుమారు రూ.150 మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నెక్‌ ప్రకటిత రైతు ధర రూ.3.15 ప్రకారం చూస్తే.. 16.5 లక్షల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వలన రైతులు రూ.51.98 లక్షల మేర నష్టపోవాల్సి వస్తోంది. కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్‌ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ. 2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా.అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని రైతులంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి, వాటరింగ్‌ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్‌ పడిపోయింది. మరోపక్క మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గుడ్డు ధర గిట్టుబాటు కాక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధిక ఎండలతో గుడ్ల డ్రాపింగ్, కోళ్ల మరణాలు పరిశ్రమను మరింత నష్టాల పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వడ్డీ రాయితీ, ఎఫ్‌సీఐ నుంచి సబ్సిడీపై మేతలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

 

Tags: Poultry communities have tripled