తాను ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి పెళ్లిచేసుకున్న ప్రబుద్ధుడు

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఆదాయ పన్ను అధికారులు బ్యాంక్ ఖాతా సీజ్ చేశారని భార్యను నమ్మించి రూ.2 కోట్లు వసూలు చేశాడు. ఆపై అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ జె ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్(38) కర్ణాటక ఐఏఎస్ క్యాడర్ లో ఎంపికైనట్లు 2016లో ఊరంతా గొప్పగా చెప్పుకొన్నాడు. ఐఏఎస్ ను అంటూ ఓ మ్యాట్రిమోనీలో వివరాలు ఉంచాడు. ఇది చూసి.. బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి(34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు. రూ.50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు ఇచ్చి 2018లో పెళ్లి చేశారు. తనకు ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించాడు. ప్రస్తుతం మల్లంపేట గ్రీన్వాలీ రోడ్డులో ఉంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సంపాదనంతా ఏదని భార్య నిలదీస్తే.. వైద్యం ద్వారా తాను రూ.40 కోట్లు ఆర్జించానని ఆదాయపన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని చెప్పాడు. అవి రావాలంటే రూ.2 కోట్లు చెల్లించాలనగా భార్య మిత్రుల ద్వారా సమకూర్చింది. ఆ డబ్బును సందీప్ కుమార్ తన తండ్రి విజయ్ కుమార్(70), అమెరికాలో ఉంటున్న సోదరి మోతుకూరి లక్ష్మీసాహితి(35) ఖాతాలకు బదిలీ చేశాడు. వివాహ సమయంలో ఇచ్చిన ఆభరణాలను తల్లి మాలతి(59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. భర్త ఐఏఎస్ ధ్రువపత్రంతోపాటు రేడియాలజీ సర్టిఫికెట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగినా అదనపు కట్నం తెమ్మని వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరో నిందితురాలు లక్ష్మీసాహితీ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

 

Tags: Prabuddha married believing that he is an IAS officer

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *