ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న శ్రద్ధా, ప్రభాస్

Date:15/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు :
బాహుబలి’ సిరీస్ తరవాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే, ఆయన తాజా చిత్రం ‘సాహో’కు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేమికులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ సైన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ బహుభాషా సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్‌లుక్, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే, తాజాగా ‘సాహో’ సంబంధించి ఒక ఫొటో లీకైంది. ఆ ఫొటోలో శ్రద్ధ కపూర్, ప్రభాస్ కూల్ లుక్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అభిమానులు ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ స్టిల్ ఒక పాటలోనిదని అంటున్నారు. పాట చిత్రీకరణలో భాగంగా ఈ స్టిల్ బయటికి వచ్చి ఉండచ్చనే వాదన వినిపిస్తోంది. ఫొటోలో ప్రభాస్ వైట్ డ్రెస్‌లో ఉండగా.. శ్రద్ధ పింక్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. వీరిద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ప్రేమను ఆస్వాదిస్తున్నట్లు ఫొటోను చూస్తుంటే స్పష్టమవుతోంది. కాగా, ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్, సుప్రీత్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Tags:Practice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *