శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రసాదాలు

Date:09/04/2020

తిరుమల ముచ్చట్లు:

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తిరుమలపైనా ప్రభావం చూపింది. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గత నెల 20వ తేదీ నుంచి టీటీడీ శ్రీవారి దర్శనాన్ని నిలిపేసింది. శ్రీవారికి మాత్రం వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతినిత్యమూ శా్రస్తోక్తంగా పూజాది కైంకర్యాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులను అనుమతించకపోవడంతో తాజాగా టీటీడీ అధికారులు ప్రసాదాల తయారీని కుదించేశారు. మూలవిరాట్టుకు నివేదించే ప్రసాదాలను యథావిధిగా తయారు చేస్తూ భక్తుల కోసం అదనంగా చేసే అన్నప్రసాదాలు, లడ్డూల తయారీని తగ్గించేసింది.

 

 

 

గతంలో ప్రతి నిత్యమూ 60నుంచి 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. వారు కోరినన్ని ఇచ్చేందుకు టీటీడీ ప్రతినిత్యమూ 3 నుంచి 4లక్షల లడ్డూలను తయారు చేసి, విక్రయించేది. 18 రోజులుగా శ్రీవారి దర్శనాన్ని నిలిపేయడంతో దిట్టం ప్రకారం చేయాల్సిన మోతాదులో ప్రసాదాలను తయారు చేసి, స్వామి వారికి నివేదిస్తున్నారు. శ్రీవారికి ఉదయాత్పూర్వం నివేదించేందుకు దిట్టం ప్రకారం లడ్డూ, వడతో పాటు అన్నప్రసాదాలను ఆలయం లోపల ఉన్న వకుళమాత పోటులో తయారు చేసి స్వామి వారికి నివేదిస్తున్నారు.

 

 

 

 

అటు తర్వాత రెండో గంట(మధ్యాహ్న ఆరాధన)లో కేవలం అన్నప్రసాదాలను తయారు చేసి మూలవిరాట్టుకు నివేదిస్తున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఏకాంతంగా జరిగే కల్యాణోత్సవ సేవ సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నివేదించేందుకు ప్రోక్తం ప్రకారం 51పెద్ద లడ్డూలు, 51వడలను నివేదిస్తున్నారు.రాత్రి మూడో గంట సమయంలో  లడ్డూ, వడతో పాటు అన్నప్రసాదాలు తయారు చేసి స్వామి వారికి నివేదిస్తున్నారు.

 

 

 

 

ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారికి మూడు పూటలా దిట్టం ప్రకారం ప్రసాదాలను తయారు చేసి, మూలవిరాట్టుకు నివేదిస్తున్నారు. స్వామి వారికి నివేదించిన ప్రసాదాలను నివేదన పూర్తయిన తర్వాత ఆలయం వెలుపలకు తరలించి తిరుమలలో విధుల్లో ఉన్న ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నారు.

 

చుక్కలు చూస్తున్న మొక్కజొన్న

Tags: Prasatoka Swami Prasadam to them

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *