ఔటర్ లో నల్లాల జారీకి రంగం సిద్ధం

   Date:16/03/2019

హైదరాబాదు ముచ్చట్లు:
ఔటర్ రింగ్ రోడ్డు  చుట్టూ కొత్త రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థ సిద్ధం కాబోతోంది. ఇప్పటికే దాదాపు 85 రిజర్వాయర్లు, 881 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ల వ్యవస్థ పనులను జలమండలి పూర్తి చేసింది. దీంతో కొత్త నల్లాల జారీకి రంగం సిద్ధం చేస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికే కొత్త నల్లా అందించనున్నారు. ఇప్పటికే ఏడువేల దాకా  కొత్త నల్లాలను జారీ చేశారు. కొత్త కనెక్షన్ కోసం  100 చదరపు మీటర్లలో ఇళ్లతోపాటు ఆహార భద్రత కార్డు ఉండాలి. ఒకవేళ ఈ కార్డు లేకపోతే…సాలుసరి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలకు దాటకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఇలాంటి కుటుంబాలన్నీ రూపాయి నల్లా పొందడానికి అర్హులేనని అధికారులు తెలిపారు.అవుటర్ చుట్టూ దాదాపు 196 గ్రామాల్లో దాదాపు 26 వేల కుటుంబాలు ఈ ప్రయోజనం పొందనున్నాయి. మరో 6070 వేల కుటుంబాలు సాధారణ కనెక్షను ఛార్జీలు చెల్లించి నల్లా తీసుకోవచ్చు. వేసవి వస్తే అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వేసవిలో భూ గర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి వస్తే నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.700 కోట్లతో గతేడాదిలో జలమండలి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు చేపట్టింది. పలు గ్రామాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, పైపులైన్ల పనులు చేపడుతున్నారు. కొన్ని చోట్ల పూర్తి చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. అటు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను అనుసంధానం చేసి సురక్షిత మంచినీటిని అందిస్తున్నారు.
Tags:Prepare the field for issuing blacks in Outer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *