వేసవి కష్టాలకు అడ్డుకట్టవేయండి

-మన్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
-తాగునీటి ఎద్దడి రానీయొద్దు
-చలివేంద్రాలు, వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయండి
-అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశం
Date:15/03/2018
అమరావతి  ముచ్చట్లు:
రాబోయే వేసవి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రానీయొద్దని, ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ప్రత్యేక సమయాలు రూపొందించాలని, మన్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వడదెబ్బ మరణాలకు అడ్డుకట్టవేయాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, వేసవి కష్టాలకు చెక్ పెట్టాలని సీఎస్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో 13 జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, వేసవి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం వడదెబ్బకు గురికాకుండా తీసుకున్న చర్యల గురించి ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు అన్నీ చర్యలు తీసుకున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు సమయాలను ఇప్పటికే మార్చామని విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత మాట్లాడుతూ, అంగన్ వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, గత వేసవి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.  మున్సిపాల్టీలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రానీయొద్దని, అవసరమైతే ట్యాంకులతో నీటిని సరఫరా చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లనూ సీఎస్ ఆదేశించారు. పశువులకు, ఇతర మూగజీవాలకు సైతం నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. పశువుల దాణా కూడా రైతులకు అందజేయాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోపై అన్ని జిల్లాల కలెక్టర్లూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తాగునీటి సరఫరా చేయాలని, మన్యంలో విస్తృతంగా వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు జరిగే చోట టెంట్లు వంటి నీడను కల్పించే సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. పనుల సమయాలను మార్పులు చేయాలన్నారు. వడ దెబ్బ మరణాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన, తీసుకోకూడని చర్యలు గురించి ప్రజల్లో చైతన్య కలిగించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు.  అనంతరం… రాష్ట్రంలో అమలవుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులపై సీఎస్ దినేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. కూలి చెల్లింపునకు అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు పంట కుంటలు తవ్వకాలు చేపట్టాలని, చెక్ డ్యాముల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు మస్టర్లు పూర్తి చేయాలని, వాటిని సంబంధిత అధికారులు పరిశీలించాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. తొలుత రాష్ట్రంలో గత పదమూడు రోజులుగా నమోదయిన ఉష్ణోగ్రత వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు…సీఎస్ కు వివరించారు. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, స్తీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పూనం మాలకొండయ్య, సునీత తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు కృష్ణానంద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Prevent summer hardship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *