Natyam ad

ఖరీదుగా మారిన మునుగోడు ఎన్నికలు

నల్గొండ ముచ్చట్లు:


మునుగోడు కూడా ఖరీదైనదిగా మారుతున్నది. ఓటర్లకే కాకుండా స్థానిక లీడర్లకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.అన్ని పార్టీలకూ ఇక్కడి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో సర్పంచ్ మొదలు ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీల లోకల్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అగ్రనేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఎలాగూ అవకాశాలు అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో స్థాయిని బట్టి లోకల్ లీడర్లు రూ. 5 లక్షల నుంచి డిమాండ్ చేస్తున్నారు. డబ్బులిస్తే ఉంటాం.. లేకుంటే ప్రత్యర్థి పార్టీ మంచి ప్యాకేజీ ఆఫర్ ఉందంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకం. కానీ ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎనిమిదేళ్లకు పైగా సొంత డబ్బుల్ని పార్టీ కోసం ఖర్చు చేసి ఆర్థిక చిక్కుల్లో పడ్డామని గుర్తుచేస్తూ జిల్లా, రాష్ట్ర నాయకత్వం నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహులకు అర్థమయ్యే తీరులో ఈ షరతులను వినిపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ ప్యాకేజీ రెడీగా ఉన్నదని, ఆ తరహాలో ఇస్తేనే కొనసాగుతామని, లేదంటే వెళ్ళిపోతామని హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ తరఫున నిలబడే అభ్యర్థి ఖర్చు ఈసారి భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గెలిస్తే ఏడాది కాలమే ఎమ్మెల్యేగా కొనసాగాల్సి ఉన్నందున డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆశావహులు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని క్షేత్రస్థాయి పరిస్థితి ఈ విధంగా ఉన్నదని తెలుసుకున్న బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారనే అంశం ఆధారంగా ఆ లీడర్లకు ప్యాకేజీలు ఖరారవుతున్నాయి. దీన్ని ప్రస్తావిస్తున్న లోకల్ లీడర్లు ప్రత్యర్థి పార్టీ ఆఫర్‌ను సొంత పార్టీ నేతలకు వివరిస్తున్నారు.నోట్ల కట్టలు వస్తే కంటిన్యూ కావడం.. లేదంటే ఆఫర్ ఇచ్చే పార్టీకి వెళ్లిపోవడం అనేది చాలా మంది స్థానిక నేతల నుంచి వ్యక్తమవుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే రాజగోపాల్‌రెడ్డి కొనసాగినందున ఇప్పుడు బీజేపీకిలోకి వెళ్లినా వారి నుంచి తగిన సహకారం కోరుకోవడం ద్వారా గరిష్ఠ స్థాయిలో ఓట్లను రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఓటర్లకు నజరానాలు ఇవ్వడానికి అలవాటుపడిన పార్టీల నేతలు ఇప్పుడు స్థానిక లీడర్లకూ అనివార్యంగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది.

 

 

హుజూరాబాద్‌లో సైతం సొంత పార్టీ నేతలను టీఆర్ఎస్ ఖర్చుపెట్టి మరీ తన వైపుకు తిప్పుకోవాల్సి వచ్చింది. ఈటల రాజేందర్ వైపు వెళ్లకుండా అనేక రకాల ప్రలోభాలకు గురిచేసింది. ఇప్పుడు మునుగోడులో అది కాంగ్రెస్ వంతు అవుతున్నది. మునుగోడు కంచుకోట అనే ధీమా కాంగ్రెస్ పార్టీకి ఉన్నా ఇప్పుడు ఉప ఎన్నికలో ఊహించని పరిస్థితి తలెత్తింది. విజయవకాశాలు ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలంటే క్షేత్రస్థాయి లీడర్లను దూరం కాకుండా చూసుకోవడం తప్పనిసరి పరిస్థితిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఖర్చు పెట్టగల స్థాయి ఉన్నవ్యక్తికే టికెట్ ఇవ్వాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతున్నది. డిమాండ్ల ప్రకారం లక్షల్లో సమర్పించుకోవడమా..? లేక గల్లీ లీడర్లతో సంబంధం లేకుండా ప్రజలకు దగ్గర కావడానికి ప్రత్యామ్నాయం ఎంచుకోవడమా? అనేది తక్షణ అవసరంగా మారింది. ఒక పార్టీగా బీజేపీని, దాని తరఫున పోటీ చేసే అవకాశమున్న రాజగోపాల్‌రెడ్డిని ఢీకొట్టడం ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇదిలా ఉండగా అధికార పార్టీకి సైతం అసమ్మతి, అసంతృప్తి తప్పడంలేదు. జిల్లా మంత్రి నుంచి ప్రగతి భవన్ వరకు పంచాయితీ చేరింది. ఇంకా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ప్యాకేజీని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ స్థానిక నాయకులు బహిరంగంగానే రాజగోపాల్‌రెడ్డి పేరును వాడుకుంటున్నారు. ఆయన ఆహ్వానిస్తున్నారని, సంతృప్తికరమైన ప్యాకేజీ ఇస్తున్నారంటూ సొంత పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. నిజానికి రాజగోపాల్‌రెడ్డి నుంచి ఆ తరహా కమిట్‌మెంట్ వచ్చిందో లేదో గానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఉప ఎన్నికను పావుగా వాడుకుంటున్నారు. ఒక పార్టీలో ఓపెన్‌గానే బయటికి వచ్చిన ఈ వ్యవహారం మిగిలిన రెండు పార్టీలకూ తగులుకున్నది. ఓటర్లతో పాటు గల్లీ లీడర్లు కూడా పోలింగ్ సమయంలో ప్రధానం కావడంతో వీలైతే ముందుగానే ప్యాకేజీ ఇవ్వడం లేకుంటే నిర్దిష్టమైన హామీతో సరిపెట్టడం జరుగుతున్నది. ప్యాకేజీకి తగినట్లుగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు చోటుచేసుకోనున్నాయి.

 

Post Midle

Tags: Previous elections turned out to be expensive

Post Midle