వేరుసెనగకు పలకని గిట్టుబాటు ధర

Price of peanut

Price of peanut

Date:08/11/2018
అనంతపురం ముచ్చట్లు:
వేరు సెనగ రైతు గిట్టుబాటు ధరల్లేక తీవ్ర ఇబ్బంది పడుతన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలు దాటి మార్కెట్లకు పంటలు తీసుకొస్తున్నా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అరకొర వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలు మిగిలి అప్పుల కోరల్లో చిక్కుకుపోతున్నారు. రాయలసీమ జిల్లాల్లో తీవ్ర కరువుతో బోర్లలో చుక్క నీరు లేకుండా పోతుంది. వేసిన పంటలు ఎండుతున్నా ఏమి చేయలేని నిస్సహాయతలో రైతులు ఉంటున్నారు.
కనీసం పండించిన పంటలకు అయినా గిట్టుబాటుకు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతుంది. రైతులు పంట పండించాలంటే గత రెండేళ్ల కాలంలో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సాగు చేయాల్సి వస్తోంది.
పంట వేయాలంటే వర్షం కురావాలి. వర్షం లేకుంటే నీటిని చూసుకోవాలి. ఎరువులు, పిచికారి మందులు, రవాణా ఛార్జీలు, పంట కోత ఖర్చు ఇలా ఒక పెద్ద లిస్ట్‌ రైతు తయారు చేసుకోవాలి. అన్ని అయ్యాక ఎక్కడ మార్కెట్‌ ధర ఉంటే అక్కడకు పరుగున పంటను వెంటపెట్టుకుని వెళ్లాలి. మార్కెట్ల చుట్టూ తిరిగి కనీస గిట్టుబాటు కోసం రవాణా ఖర్చును లెక్క చేయకుండా జిల్లాలు దాటి వచ్చినా ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు వేరుశెనగ అమ్ముకునేందుకు వచ్చిన అనంతపురం రైతులు రవాణా, కోత కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రైతు బాధనే ఇలా ఉంటే కర్నూలు, ఇతర జిల్లాల రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సోమవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు వేరుశనగ తెచ్చిన రైతులందరు అనంతపురం జిల్లాకు చెందిన వారే. అక్కడ మార్కెట్‌ ఉన్నా ప్రారంభం కాలేదు.
రైతులకు అక్కడ మార్కెట్‌ అందుబాటులో ఉన్నా రవాణా ఖర్చులయినా మిగిలేవని అనంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు మార్కెట్‌కు వచ్చిన మొత్తం వేరుశనగ 562 క్వింటాలు అనంతపురం జిల్లా నుండి తెచ్చిన రైతులదే కావడం విశేషం. పంటలకు గిట్టుబాటు కల్పిస్తే కొంత ఊరట ఉంటుందని రైతులు కోరుతున్నారు. ఈ నెల 5వ తేదీ నుండి కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు
వచ్చిన వేరుశనగ, ధర వివరాలు.
తేదీ. క్వింటాలు కనిష్ఠ ధర గరిష్ఠ ధర.
5.11.18 199 రూ. 3223 రూ. 5689.
6.11.18 210 రూ. 3098 రూ. 5675
7.11.18 231 రూ. 1963 రూ. 5561
Tags: Price of peanut

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *