ప్రధాని మోడీ ప్రసంగం అదుర్స్

Prime Minister Modi's speech

Prime Minister Modi's speech

 Date:21/07/2018
న్యూ డిల్లీ ముచ్చట్లు:
ప్రధాని మోడీ ప్రసంగం అదుర్స్మాటలతో ఫిదా.. తప్పు చేసినా..దాన్ని అందంగా కప్పిపుచ్చారు.
బలం లేకున్నా..బలం ఉందంటూ అహంకారాన్ని ప్రదర్శించారంటు వ్యంగ్య వ్యాఖ్యలు
వారి మీద వారికే విశ్వాసం లేదు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టారు.
తమతోపాటు ఎవరున్నారో తెలుసుకునేందుకు కాంగ్రెస్ పెట్టుకున్న ట్రయల్ రన్ పరీక్ష!
జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులను రాకుండా అడ్డుకున్నది యూపీఏ నే
మేం అధికారంలోకి రాకపోతే దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో పడేది.
అధికారం కోసం ఆకలిగాఎదురు చూస్తున్న కాంగ్రెస్ టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పార్లమెంటును ఉద్దేశించి మోడీ ప్రసంగం ఒక వర్గం మినహా  దాదాపు అన్ని వర్గాలను ఆకట్టు కుందనడంలో అతిశయోక్తి లేదు, మాటలతో ఫిదా అయ్యేలా చేయటం.. తప్పు చేసినా.. దాన్ని అందంగా కప్పి పుచ్చుకోవటం.. ఎదురుదాడితో తనపై వేలెత్తి చూపించే వారు సైతం తమ వాదనల్ని మర్చిపోయేలా చేయటం ప్రధాని మోడీకి మాత్రమే సాధ్యమయ్యే నేర్పుగా చెప్పక తప్పదు.అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునే సంఖ్యా బలం లేకున్నా.. బలం ఉందంటూ అహంకారాన్ని ప్రదర్శించారంటు వ్యంగ్య వ్యాఖ్యలతో పాటు.. ప్రత్యర్థిపై ఏ మాత్రం కనికరం ప్రదర్శించకుండా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన వాదనలకు లాజిక్కులు చూపిస్తూ.. తాను బాధ్యత వహించాల్సిన అంశాల్ని సైతం తెలివిగా కాంగ్రెస్ వైఫల్యాల ఖాతాలో వేయటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.
తనపై విమర్శనాస్త్రాల్ని సంధించే కాంగ్రెస్ పై మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగంలోని హైలెట్స్ చూస్తే..
*‘‘అవిశ్వాసం పెట్టడం మంచిదే. మా వాదన చెప్పుకొనేందుకు ఒక మంచి అవకాశం లభించింది. అభివృద్ధిని వ్యతిరేకించే నకారాత్మక ముఖాలన్నీ ముసుగు నుంచి బయటపడ్డాయి. తగిన బలం లేకున్నా అవిశ్వాసం తెచ్చారు.  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎందుకంత తొందర? ఎప్పుడెప్పుడు ఈ సీటులోకి రావాలా అనే ఆకాంక్షతో నన్ను లేవమంటున్నారు’’
* వారి మీద వారికే విశ్వాసం లేదు. కానీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టారు. ఇది ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష కాదు. తమతోపాటు ఎవరున్నారో తెలుసుకునేందుకు కాంగ్రెస్ పెట్టుకున్న పరీక్ష! ఇది ట్రయల్ రన్
* కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆకలిగా ఉంది. స్వచ్ఛభారత్ అంతర్జాతీయ యోగాదినం – న్యాయవ్యవస్థ – ఆర్బీఐ సహా.. మా ప్రభుత్వాన్ని ప్రశంసించే అంతర్జాతీయ సంస్థలపైనా కాంగ్రెస్ కు విశ్వాసం లేదు. ఈవీఎంల పైనా వారికి విశ్వాసం లేదు.
* తాము అధికారంలో లేకపోతే చాలు.. రాజకీయంగా అస్థిరత సృష్టించడమే కాంగ్రెస్ నైజం. ‘మాకు బలం లేదని ఎవరన్నారు’ అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితం.1999లో ఇలాగే రాష్ట్రపతి భవన్ ముందు నిలబడి.. తమకు 272మంది సభ్యుల బలం ఉందన్నారు. ఇంకా వస్తారన్నారు. అటల్ జీ సర్కారును ఒక్కఓటు తేడాతో పడగొట్టారు. కానీ 272మంది బలం సాధించలేదు. మళ్లీ 13నెలలకే ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆట ఆడుతున్నారు. ఇది వాళ్లకు అలవాటు.
* 1979లో చౌదరి చరణ్ సింగ్ కు మద్దతిచ్చి వెనక్కి తీసుకున్నారు. చంద్రశేఖర్ కు కూడా ఇదే పద్ధతిలో ముందు మద్దతిచ్చి – ఆ తర్వాత కిందికి తోసేశారు. 1997లో దేవెగౌడను అవమానించారు. ఆ తర్వాత ఐకే గుజ్రాల్ వంతు వచ్చింది. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఓటుకు నోటుతో ‘విశ్వాసాన్ని కొనుగోలు’ చేసిన ఆటలు కూడా అందరికీ తెలిసినవే.
* ‘ప్రధాని నా కళ్లలోకి చూసి మాట్లాడలేరు’ అన్న రాహుల్ మాటలను ప్రస్తావిస్తూ.. ‘‘మీ కళ్లలో కళ్లు పెట్టి ఎలా చూడగలం. నేను పేద కుటుంబానికి చెందినవాడిని. పల్లె నుంచి వచ్చాను. మీరు వారసత్వంతో పైకొచ్చినవారు – మేం కష్టంతో పైకొచ్చిన వాళ్లం. మీ కళ్లలోకి చూసేంత ధైర్యం మాకెక్కడిది!’
* ‘‘సుభాష్ చంద్రబోస్ – మొరార్జీ దేశాయ్ – జయప్రకాశ్ నారాయణ్ – చరణ్ సింగ్ – వల్లభ్ భాయ్ పటేల్ – చంద్రశేఖర్ చివరికి ప్రణబ్ ముఖర్జీ – శరద్ పవార్ కూడా మీ కళ్లలో కళ్లు పెట్టాలని చూశారు. అలాంటి వాళ్లను మీరు ఎలా అవమానిస్తారో – ఏం చేస్తారో అందరికీ తెలుసు!’’
* తనను కౌగిలించుకున్న రాహుల్.. అనంతరం సహచర సభ్యుడికి కన్నుకొట్టిన వైనాన్ని తన కళ్లు ఆర్పి – చేతులు ఆడించి అనుకరిస్తూ హేళన చేశారు.
* జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురాకుండా అడ్డుకున్నది యూపీఏ ప్రభుత్వమే. అది కూడా తెలియకుండా రాహుల్ మాట్లాడుతున్నారు.  గుజరాత్ సీఎంగా ఉండగా తానే జీఎస్టీని అడ్డుకున్నానన్న వాదనను తిప్పికొట్టారు. రాష్ట్రాల సమస్యలు పరిష్కరించకుండా అహంకారంతో వ్యవహరించినందుకే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశా.
* అప్పట్లో కాంగ్రెస్ సీఎంలు  వచ్చి.. తమ సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకురావాలని కోరేవారు.అప్పుడు సీఎంగా ఉన్న అనుభవంతోనే అన్ని రాష్ట్రాల సమస్యలను పరిగణనలోకి తీసుకుని జీఎస్టీ తీసుకొచ్చాం.
* రాఫెల్ డీల్ – డోక్లాం – సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ విమర్శల్ని తిప్పికొడుతూ..  దేశ భద్రతతో ఆడుకుంటున్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించే సైనికులను అవమానిస్తున్నారు.  రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలవలేదని తొలుత చెప్పి… తర్వాత కలిసినట్లు అంగీకరించారు. రాఫెల్ డీల్ రెండు ప్రభుత్వాల మధ్య జరిగింది. ప్రవేటుది కాదు.  ఇందులో మోసం ఎలా జరుగుతుంది? ఈ సభలో జరిగిన చర్చ కారణంగా… ఇదే అంశంపై రెండు దేశాలు ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయాల్సి వచ్చింది.
* ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయవచ్చా?  మీకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. దానినుంచి కొంతైనా నేర్చుకోండి. చివరకు దేశ సైన్యాధ్యక్షుడి విషయంలోనూ అభ్యంతరకర భాష ఉపయోగిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి కూడా అబద్ధమని అంటున్నారు. ఇందుకు ఈ దేశం కాంగ్రెస్ ను ఎప్పటికి క్షమించదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబంధం తెగింది. అది మునుగుతుంది. దాంతో పాటు కలిసే వాళ్లు మునుగుతారు.
* బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరగడానికి యూపీఏ విధానాలే కారణం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రాకముందే.. వీళ్లు ఫోన్ బ్యాంకింగ్ కనిపెట్టారు. బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి ఫలానా వాళ్లకు రుణం ఇవ్వాలని ఆదేశిస్తారు. అదివ్వగానే.. మరొక ఫోన్ మరొకరికి రుణం. ఇలా ఇస్తూనే వచ్చారు.
*2014లో మేం అధికారంలోకి రాకపోయి ఉంటే.. దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో పడేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 60ఏళ్లలో బ్యాంకులు రూ.18లక్షల కోట్ల అప్పులు ఇవ్వగా యూపీఏ హయాంలో కేవలం ఆరేళ్లలో 50లక్షల కోట్లకుపైగా రుణం ఇచ్చారు.  బ్యాంకుల ఖజానాను దోచిపెట్టారు.
* నల్లధనంపై యుద్ధం మొదలుపెట్టాం. ఇది ఆగదు. దీనివల్ల ఎవరికి ఇబ్బంది వచ్చిందో కూడా నాకు తెలుసు.  2.5 లక్షల డొల్ల కంపెనీలను మూసివేశాం. రెండు దశాబ్దాల కిందట ఆమోదించిన బినామీ ఆస్తుల చట్టాన్నిమేం  వచ్చాకే నోటిఫై చేశాం.  ఉంటే మేం ఉండాలి. లేదంటే… దేశంలో అస్థిరత ఉండాలనేదే కాంగ్రెస్ నైజం. దీని కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారు.
* అసత్య ప్రచారం కోసం ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నారు. ‘‘రిజర్వేషన్లు తొలగిస్తామని దళితుల రక్షణ కోసం ఉన్న చట్టాన్ని నీరుగారుస్తున్నామని ప్రచారం చేస్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్తో… సమస్యలతో ఆడుకుంటారు’’.
* ‘‘నేను గర్వంగా చెప్పగలను. మేం కాపలాదారులం. అదే సమయంలో వాటాదారులం కూడా. కానీ మేం మీకులా వ్యాపారులం కాదు. 125 కోట్ల ప్రజల కష్టాలు – కలల్లో నేను వాటాదారుని. ‘‘ఈమధ్య కాలంలో చాలామంది శివశక్తి గురించి మాట్లాడుతున్నారు. 2024 నాటికి మీకు మరింత శక్తి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మీరు మరో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి కదా’’అని అన్నారు.
ప్రధాని మోడీ ప్రసంగం అదుర్స్  https://www.telugumuchatlu.com/prime-minister-modis-speech/
Tags:Prime Minister Modi’s speech

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *