75 రూపాయిల కాయిన్ విడుదల చేయనున్న ప్రధాని
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పక్కా షెడ్యూల్ ప్రకారం ఈ తంతు జరగనుంది. ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.75 కాయిన్‌ని విడుదల చేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ కాయిన్‌ని విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రత్యేక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ కాయిన్ వివరాలనూ వెల్లడించింది. 44 మిల్లీమీటర్ల డయామీటర్‌తో ఉంటుందని తెలిపింది. ఈ కాయిన్‌ని 50% వెండి, 40% రాగి, 5%నికెల్, 5% జింక్‌తో తయారు చేశారు. “కాయిన్‌పై అశోక పిల్లర్‌తో పాటు దానిపై పులి బొమ్మ ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అనే నినాదం రాసి ఉంటుంది. ఎడమ వైపున “భారత్” అని మెన్షన్ చేశాం. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. కుడివైపు ఇంగ్లీష్‌లో “ఇండియా” అని కనిపిస్తుంది. మరో వైపు పార్లమెంటరీ కాంప్లెక్స్ బొమ్మ ప్రింట్ అయ్యుంటుంది.

పార్లమెంటరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్‌పై సన్సన్ సంకుల్ అని రాసి ఉంటుంది.”కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు ముదిరాయి. అన్ని పార్టీలనూ ఆహ్వానించామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విపక్షాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ…బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ పాల్గొంటారు. ఉదయం 7.30 గంటలకు హవన్ పూజ మొదలవుతుంది. 8.30 గంటల వరకూ ఇది కొనసాగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్ ని లోక్‌సభలో పొందుపరచనున్నారు. ఈ మొత్తం తంతులో ఇదే హైలైట్ అవనుంది. ఆ తరవాత 12 గంటలకు పార్లమెంట్‌ని ప్రారంభించి ప్రసంగిస్తారు ప్రధాని.
Tags:Prime Minister will release 75 rupees coin
