ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తారా…

Priyanka Gandhi will contest from Varanasi
 Date:20/04/2019
లక్నో ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన  ప్రియాంక గాంధీ నాటి నుంచి  క్రియాశీల రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. యూపీ తూర్పు విభాగం పార్టీ బాధ్యతలు చేపట్టిన  ఆమె ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ప్రధాన  నరేంద్ర మోదీ రెండోసారి బరిలో దిగుతున్న వారణాసి నుంచి  ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా బాగా జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. ఈనేపథ్యంలో  రాహుల్ గాంధీ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వారణాసి నుంచి ప్రియాంక గాంధీని పోటీకి నిలబెడతారా అంటూ మీడియా ప్రతినిధి ఆయనను  ప్రశ్నించారు. ఇందుకు రాహుల్ స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మిమ్మల్ని సస్పెన్స్‌లోనే ఉంచుతాను. సస్పెన్స్ అనేది ఎప్పుడూ చెడ్డ విషయం కాదు’ అని చెప్పారు. అంటే ఈ వార్తలను మీరు తోసిపుచ్చడం లేదు కదా అని మీడియా ప్రతినిధి మళ్లీ అడగగా.. ‘నేను ఏ వార్తలను ధ్రువీకరించడం లేదు.. తోసిపుచ్చడం లేదు’ అని  రాహుల్ గాంధీ  అన్నారు. కాగా తన తల్లి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని గత నెలలో  కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక గాంధీని కోరారు. దానికి ఆమె స్పందిస్తూ.. ‘నేను పోటీ చేసే స్థానం వారణాసి’ ఎందుకు కాకూడదు అని తిరిగి ప్రశ్నించారు.ఆ మరుసటి రోజే పార్టీ కోరుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. దీంతో ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఆమె వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. మరోవైపు వారణాసిలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ప్రియాంక గాంధీ పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వారణాసి నుంచి ప్రియాంక గనుక బరిలోకి దిగితే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నిక ఇదే కానుంది.
Tags:Priyanka Gandhi will contest from Varanasi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *