మునుగోడుపై ప్రియాంక ఫోకస్

నల్గోండ  ముచ్చట్లు:


మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ప్రియాంకాగాంధీ సమావేశం కానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం జరగనున్న ఈ సమావేశంలో ప్రియాంకా గాంధీ చొరవ తీసుకోనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్, ప్రచార కమిటీ ఛైర్మన్, క్యాంపెయిన్ కమిటీ బాధ్యులు, సీఎల్పీ నేత, సీనియర్ నాయకులు, ఎంపీలు, నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి దారితీసిన పరిణామాలతో పాటు రానున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున నిలబెట్టాల్సిన అభ్యర్థిని ఖరారు చేయడం వరకు ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న తరుణంలో సొంత పార్టీలోనే అసమ్మతి రావడం, కొద్దిమంది పార్టీని వీడడం, మరికొద్దిమంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న అంశాలన్నీ ఏఐసీసీ దృష్టికి వెళ్ళాయి. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పోకడలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు ఒక టీమ్‌గా పనిచేస్తున్నారని,

 

 

ఇది సీనియర్ నేతలకు మింగుడు పడడంలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మునుగోడు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానమైందున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసీసీ కూడా గట్టిగా కోరుకుంటున్నది.మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వైఖరితో పాటు ఆ నియోజకవర్గంలో, జిల్లాలో ఉన్న అసంతృప్తిపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. పార్టీలో అసంతృప్తి చోటుచేసుకున్నప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తటస్థ పాత్ర పోషించాల్సి ఉన్నప్పటికీ పీసీసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాణిక్కం ఠాగూర్‌పై ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులందరి అసంతృప్తిలో పీసీసీ చీఫ్ ప్రధాన టార్గెట్‌గా మారారన్నది ఏఐసీసీ భావన. ఢిల్లీలో మంగళవారం ప్రియాంకాగాంధీ పాల్గొనే సమావేశంలో మునుగోడు అభ్యర్థి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉన్నది.

 

Tags: Priyanka’s focus is on the past

Leave A Reply

Your email address will not be published.