సమస్యలు పరిష్కృతమైతేనే..సమర్ధ సేవలు..

Date:09/10/2018
కర్నూలు ముచ్చట్లు:
సమర్ధవంతమైన సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలు నిలబెట్టాల్సిన బ్లడ్ బ్యాంక్స్ అలంకారప్రాయంగా తయారయ్యాయన్న విమర్శలు కర్నూలు జిల్లా ఆదోనిలో చక్కర్లు కొడుతున్నాయి. అవసరతల్లో ఉన్నవారికి ఈ కేంద్రాల ద్వారా సరైన సేవలు లభించడంలేదని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి సమర్ధవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్థానికులు చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి ఉండడానికి డివిజన్‌ కేంద్రాల నుంచి పరిమిత స్థాయిలో బ్లడ్ ప్యాకెట్స్ రావడం ఓ కారణంగా తెలుస్తోంది.
ఎందుకంటే డివిజన్ సెంటర్స్ నుంచి నెలకు సుమారు 12 లేదా 14 రక్త ప్యాకెట్లను తెచ్చి నిల్వ కేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. బాధితులెవరైనా వస్తే.. వారు అడిగిన గ్రూప్‌ రక్తం  ఉంటే తగిన పరీక్షలు నిర్వహించి అందిస్తున్నారు. లేకపోతే మాత్రం వెనక్కి పంపుతున్నారు. మరోవైపు కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారిని నుంచి రక్తం సేకరించేందుకు తగిన ఏర్పాట్లు లేనట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పట్టణాలు.. నగరాలకు వెళ్లాల్సివస్తోంది. అదే బ్లీడింగ్‌, పరీక్షలకు అవకాశం ఉంటే పట్టణప్రాంతాల్లోనే సమస్య కొంత అదుపులో ఉంటుందని పలువురు అంటున్నారు.
ఇటీవలే కోడుమూరు, బనగానపల్లె, నందికొట్కూరు, ఆలూరు, ఆదోని ఎంసీహెచ్‌ ఆస్పత్రుల్లో రక్తనిల్వ కేంద్రాలకు అనుమతులిచ్చారు. ఇందులో ఒకటి  తప్ప మిగిలిన కేంద్రాల్లో ఇంతవరకు కార్యకలాపాలు పెద్దగా మొదలవలేదు. ఇదిలాఉంటే రక్తదాన కేంద్రాల నిర్వహణకు నిధులు చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో రక్త ప్యాకెట్‌ ఇచ్చేందుకు ల్యాబ్‌ సేవల కోసం కొంత మొత్తం తీసుకుంటారు. ప్రైవేటు ఆస్పత్రి నుంచి రోగులు వస్తే రూ.800, ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వస్తే ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగానే అందిస్తారు.
ఇలా ఇప్పటివరకు ఆదోని కేంద్రంలో సేకరించిన సుమారు రూ.28 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. గతంలో ఐఆర్‌సీఎస్‌ ఉన్నప్పుడు స్వతంత్రంగా కొనుగోలు చేసుకుని.. అవసరాల కోసం వెచ్చించేవారు. ప్రస్తుతం ఏపీవీవీపీ కింద చేర్చి హార్మని కన్సల్టెన్సీ నిర్వహణ తీసుకుంది. దీంతో ఈ కేంద్రం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఏ పని చేయాలన్నా..నిర్ణయం తీసుకోవాలనుకున్నా పై అధికారుల సూచనల మేరకే నడవాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు త్వరితగతిన పరిష్కరించాలని అంతా కోరుతున్నారు. ఆదోని బ్లడ్‌ బ్యాంక్‌లో సమస్యలు పరిష్కృతమైతే బాధితులకు మరింత సమర్ధవంతైన సేవలు లభిస్తాయని అంతా అంటున్నారు.
Tags:Problems solved ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *