వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Production of coal with rain

Production of coal with rain

Date:24/09/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
బొగ్గు కొరత విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద గల సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ)కు వేధిస్తోంది. బొగ్గు కొరత కారణంగా సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో గల మొదటి 500 మెగావాట్ల యూనిట్‌ను  అధికారులు షట్‌డౌన్ చేశారు.
నాలుగు యూనిట్లలో 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు సింహాద్రిలో లేక పోవడం మొదటి యూనిట్‌ను షట్‌డౌన్ చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత కొన్ని రోజుల నుండి సింహాద్రిలో నాలుగు యూనిట్లలో లోడ్‌ను తగ్గిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తున్న అధికారులు శనివారం మొదటి యూనిట్‌ను పూర్తిగా షట్‌డౌన్ చేశారు.
ప్రస్తుతం సింహాద్రిలో 2,3,4 యూనిట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తాల్చేరు బొగ్గు గనుల్లో పనులు నడవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీనికారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో పాటు రైల్వేలైన్లు కాస్త ఇబ్బంది పెడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు అవసరమైన బొగ్గు అందుబాటులో లేదు. సింహాద్రిలో గల బొగ్గు నిల్వలు ఇప్పటికే కరిగి పోయాయి. ప్రస్తుతం వారం రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.
సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు ఒడిశా సమీపంలో గల తాల్చేరులోని శ్రీ నంది కోక్ ఓవెన్స్ నుండి బొగ్గును రైలు మార్గంలో సింహాద్రి దిగుమతి చేసుకుంటోంది. గతంలో విదేశీ బొగ్గును సైతం సింహాద్రి దిగుమతి చేసుకునేది. స్వదేశీ బొగ్గు 70 శాతం, విదేశీ బొగ్గు 30 శాతం కలిపి విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే వారు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా విదేశీ బొగ్గును ప్రస్తుతం దిగుమతి చేసుకోవడం లేదు. ప్రస్తుతం పూర్తి స్థాయి స్వదేశీ బొగ్గుతోనే సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సింహాద్రిలో నాలుగు ఐదు వందల మెగావాట్ల యూనిట్లు ఉన్నాయి. నాలుగు యూనిట్లూ కలిపి 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.
దీని కారణంగా సింహాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు అవసరమయ్యే బొగ్గు దిగుమతి కావడం లేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గితే బొగ్గు దిగుమతి పెరిగి సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Tags:Production of coal with rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *