నెహ్రూ వర్థంతి సందర్భంగా కార్యక్రమాలు

Date:17/04/2018
విజయవాడ ముచ్చట్లు:
దేవినేని నెహ్రూ… రాష్ట్ర్లంలో ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసం లేదు..  బెజవాడ రాజకీయ చరిత్రలో నెహ్రూ కు ఓ అత్యున్నత స్థానం ఉంది. ఒకే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు పార్టీ కంటే వ్యక్తిగానే ఇమేజ్ ఉందని చెప్పవచ్చు.. జిల్లా వ్యాప్తంగా తనకంటూ కొంత కేడర్, అభిమానులను ఏర్పరచుకున్న నెహ్రూ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తిరుగు లేని నేతగా వెలుగొందారు.  విద్యార్ధి నాయకుడిగా రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన ఆయన టీడీపీ ఆవిర్భావంలో కీలక సూత్రధారిగా ఎదిగారు. అన్న ఎన్టీఆర్ తో కలసి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన చివరి వరకు అన్నగారితోనే నడిచారు. ఎన్టీఆర్ మృతితో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన చివరకు వంటి పై టీడీపీ జెండా తో తనువు చాలించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికి  రాజకీయాలలో ముఖ్యంగా చెప్పుకునే ఎన్నో సంఘటనలు దేవినేని కుటుంబానికి చెందినవే. 1982 లో పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పార్టీ తో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన దేవినేని నెహ్రూ, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి  అత్యంత సన్నిహితుడనే చెప్పాలి. 1983 లో కంకిపాడు నియోజకవర్గం నుంచి తొలి సారి అసెంబ్లీకి వెళ్లిన నెహ్రూ అప్పటి నుంచి ఆ నియోజకవర్గానికి ఆయన పేటెంట్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు.. 1983, 85, 89, 94 ఎన్నికలలో కంకిపాడు నుంచే వరుసగా శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. వరుసగా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారంటే ఇక ఆయన పట్టు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1988 లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన వంగవీటి మోహనరంగా హత్యోదంతంలో నెహ్రూ పేరు వచ్చినా 1989 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా విజయదుంధుబి మోగించారు.  పార్టీ ఆవిర్భవం నుంచి  పదవీ కాంక్ష లేకుండా రామారావుగారితో పనిచేసిన నెహ్రూ కు 1994 సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఎన్టీఆర్ కేబినేట్ లో మంత్రి పదవి వరించింది.  తెలుగుదేశం పార్టీలో తన మార్కు రాజకీయ జీవితాన్ని కూడా అనుభవించారని చెప్పవచ్చు.దేవినేని నెహ్రూ అంటే కమిట్ మెంటుకు కేరాఫ్ అడ్రస్ అని ఆయన అభిమానులు చెపుతుంటారు. తన రాజకీయ ప్రస్థానం ఎన్నిమలుపులు తిరిగినా పదవుల కన్నా కమిట్ మెంటే ముఖ్యం అనేది నెహ్రూ శైలిగా చెప్పవచ్చు. 1995 లో జరిగిన అధికార మార్పిడిలో టీడీపీ ని వీడిన నెహ్రూ ఎన్టీఆర్ తోనే తన పయనం అంటూ అన్న తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 1996లో  నందమూరి తారకరామారావు గారి మరణానంతరం కొంత కాలం లక్ష్మీ పార్వతి సారధ్యంలోని లక్ష్మీ పార్వతి టీడీపీ పార్టీ పంచనే చేరారు.  లక్ష్మీ పార్వతి పార్టీకి ప్రజలనుంచి సరైన ఆదరణ లేక పోవడంతో నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 ఎన్నికలలో కంకిపాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఓటమి పాలయ్యారు. అయినా కుంగి పోకుండా 2004 లో అదే నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు. నియోజకవర్గాల పునర్విభజనతో విజయవాడ తూర్పు నుంచి 2009 లో కాంగ్రెస్ నుంచే బరిలో దిగారు. అయితే  ప్రజా రాజ్యం అవిర్భావంతో త్రిముఖ పోటీని ఎదుర్కొన్న నెహ్రూ కేవలం 180 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పదవి ఉన్నా లేక పోయినా కాంగ్రెస్ తోనే ఆయన పయనించారు. ఆయన, రాష్ట్ర రాజకీయాలలో తన తనయుడు అవినాష్, నిలబెట్టాలనే ఉద్దేశంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించేలా చేశారు. 2014 ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ  ఎంపి స్థానానికి అవినాష్ ను  పోటీ చేయించి తాను మాత్రం మరో సారి తూర్పు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2014 ఎన్నికలలో ఆ పదవికి పోటీలో ఓటమి పాలయ్యారు అవినాష్. ఆ తరువాత నెహ్రూ తనయుడిగా అవినాష్కు కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయికుడిగా గుర్తింపు ఇచ్చినప్పటికి, నెహ్రూ వర్గానికి, కాంగ్రెస్ పార్టీ లో కూడా గుర్తింపు రాను రాను తగ్గిపోవడం మొదలయింది. ఎంత చేసినా ప్రజల నుంచి ఆ పార్టీకి సరైన స్పందన రావడంలేదని గమనించారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నమ్మిన పార్టీ కోసం , కమిట్ మెంటు ఉన్న లీడర్ గా నెహ్రూ కాంగ్రెస్ లొ తన ప్రస్థానాన్ని సాగాంచారు. తన రాజకీయ జీవితాన్ని పునరాలోచించిన నెహ్రూ, తనకు రాజకీయంగా గోరుముద్దలు తినిపించిన తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు.  చాలాకాలంగా, చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలను నిశితంగా పరిశీలించానని, అభివృధ్ధే లక్ష్యంగా ఆయన చేసే కార్యక్రమాలకు అండగా ఉంటానని ప్రకటించి సొంత గూటికి చేరారు.  తన మాతృ సంస్ధ అయిన తెలుగుదేశం పార్టీకి చేరారు నెహ్రూ.  తన తరువాత తన తనయుడు అవినాష్ ను రాజకీయాలలో ఎలాంటి పరిస్ధితిలో అయినా సరే నిలబెట్టాలని ఆయన పూర్తి ప్రయత్నాలు చేసారు. నెహ్రూ ఎక్కడికి వెళ్లినా ఆయన  అనుచరులు మాత్రం ఆయనతో పయనించారు.  పార్టీలో రీ ఎంట్రీ రోజునే వేదికపై నెహ్రూ ఒక విషయాన్ని చెప్పారు. తాను ఎప్పటికీ టీడీపీని వీడేది లేదని చనిపోతూ టీడీపీ జెండా కప్పుకునే పోతానని సభలోనే ప్రకటన చేశారు. తధాస్తు దేవతలుంటారు అన్నట్లు పార్టీ లో చేరిన అనతి కాలంలోనే ఆయన  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడిన హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అదే సమయంలో  గుండెపోటు రావడంతో నెహ్రూ మరణించారు.  అయితే విజయవాడ చరిత్రలోనే ఒక మైలు రాయి శ్వాస విడిచింది అనే విషయం తెలియడంతో, అటు విజయవాడ వాసులు, ఇటు నెహ్రూ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ వారసుడు అయిన దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో పాటు సాయంత్రం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నెహ్రూ అభిమానులు భారీగా కార్యక్రమానికి తరలి రానున్నారు.
Tags:Programs during Nehru’s funeral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *