ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి

-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
Date:15/032018
సచివాలయం ముచ్చట్లు:
 వరల్డ్ బ్యాంకు, విదేశీ సంస్థల రుణ సాయంతో అమలవుతున్న ప్రాజెక్టులను నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని వివిధ శాఖాధిపతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో వరల్డ్ బ్యాంకు, ఎక్సటర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు(ఈఏపీ) పనుల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా వరల్డ్ బ్యాంకు, విదేశీ సంస్థల రుణ సాయంతో అమలవుతున్న ప్రాజెక్టుల ప్రగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏయే పనులు పూర్తయ్యాయి…ఎన్ని ప్రగతిలో ఉన్నాయి…నిధులు ఏ మేరకు ఖర్చు చేశారని సీఎస్ ప్రశ్నించారు. రాష్ట్రంలో విదేశీ ఆర్థిక సాయంతో 21 ప్రాజెక్టులు జరుగుతున్నాయని సీఎస్ కు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కల్పన, రోడ్ల నిర్మాణం, నీటిపారుదల, అందరికీ విద్యుత్, గ్రీన్ ఎనర్జీ కారిడార్, సముద్ర తీరంలో రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు ఈఏపీ కింద చేపట్టామన్నారు. అలాగే, మరికొన్ని పనులకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వాటిని ప్రారంభించాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, నిర్ధేశించిన లక్ష్యంలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. కొన్ని ప్రాజెక్టుల పనులు నత్తనడకగా సాగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఈఏపీ పనుల ప్రగతిపై ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. ఈఏపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులను సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.
Tags: Projects should be completed in a timely manner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *