పుంగనూరు పట్టణ ఎంబిటి రోడ్డు పనులు త్వరలో ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎంబిటి రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని , రూ.45 కోట్లతో ఖర్చు చేసి, 10 కిలో మీటర్ల రోడ్డును అత్యంత సుందరంగా నిర్మించనున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపాలిటిలో చైర్మన్ అలీమ్‌బాషా, జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఎన్‌హెచ్‌ఏఈ అజయ్‌తో కలసి ఎంబిటి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సహకారంతో టెండర్లు ప్రారంభించడం జరిగిందన్నారు. రోడ్డు 13 మీటర్ల వెడల్పుతో మూడు మీటర్లలో ఇరువైపులా మురుగునీటి కాలువలు, పాదాచారుల బాటతో పాటు డివైడరు, ఎల్‌ఈడి లైట్లు అమర్చి పట్టణాన్ని సుందరంగా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. నాగభూషణం మాట్లాడుతూ రోడ్డును సుందరంగా ఏర్పాటు చేసి , పట్టణానికి గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు రోడ్డు డిజైన్‌ను పరిశీలించారు. రోడ్డును భీమగానిపల్లె నుంచి పట్టణ మీదుగా గుడిసెబండ వద్దకు కలుపుతామన్నారు. పట్టణాభివృద్ధికి ప్రజలందరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ డీఈఈ మహేష్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, సీమ జిల్లాల వాణిజ్యవిభాగం అధ్యక్షుడు వెంకటేష్, కౌన్సిలర్లు నటరాజ, నరసింహులు, జెపి.యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Punganur urban MBT road works to start soon
