కాంగ్రెస్ లో ప్రక్షాళన ప్రకంపనలు

హైదరాబాద్ ముచ్చట్లు:


కాంగ్రెస్ పార్టీలో మరో వివాదానికి అడుగులు పడుతున్నాయి. చాలా కాలంగా జిల్లా పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న వారిని తొలిగించేందుకు ప్లాన్ సిద్ధమైంది. సీనియర్లను జిల్లాల నుంచి తీసి, టీపీసీసీలో ఏదో ఒక పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇందులోనూ రేవంత్ ముద్ర ఉండనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా వివరాల సేకరణ మొదలైంది. టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్లతో పాటుగా రేవంత్వర్గీయులతో సమాచారాన్ని తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా 11 జిల్లాల డీసీసీ చీఫ్‌లను పక్కన పెట్టనున్నారు. మరో 10 జిల్లాలకు పూర్తిస్థాయి అధ్యక్షులను నియమించనున్నారు. ఇప్పుడు ఇంచార్జీలుగా ఉన్నవారిని పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్ర పార్టీలో మళ్లీ అంతర్యుద్ధాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సీనియర్ల మధ్య విభేదాలు అంతర్గతంగా పెరుగుతూ‌‌నే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీపీసీసీ చీఫ్ తీసుకునే ఈ మార్పు నిర్ణయం మరింత ఆజ్యం పోస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.కాంగ్రెస్ పార్టీలో పదవుల పందెం మొదలవుతోంది. ఇప్పుడు పార్టీ పదవులే హస్తం నేతలకు దిక్కుగా మారడంతో.. చాలామంది పార్టీ పగ్గాల కోసం పోటీ పడుతున్నారు. జూన్‌ చివరి వారంలో పూర్తి స్థాయిలో టీపీసీసీ కార్యవర్గంతో పాటుగా జిల్లా పార్టీ కార్యవర్గాలను సైతం ప్రకటించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డీసీసీ చీఫ్‌ల నియామకంలో టీపీసీసీ చీఫ్ తీసుకునే నిర్ణయంపై పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. కీలక సమయంగా భావిస్తున్న నేపథ్యంలో మార్పులు పార్టీ కార్యక్రమాలకు ఆటంకంగా మారుతాయనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. డీసీసీల మార్పు తర్వాత టీపీసీసీని కూడా ప్రకటించాలనుకుంటున్నారు. చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈసారి పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళలకు కూడా స్థానం కల్పించాలని సీనియర్లు చెప్తున్నారు.

 

 

 

కాంగ్రెస్ పార్టీకి 10 జిల్లాల్లో డీసీసీ చీఫ్‌లు లేరు. పార్టీ కార్యవర్గాలు కూడా ఉన్నాయా.. లేవా అన్నట్టే ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయి కమిటీలను వేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా మరో 11 జిల్లాల పార్టీ అధ్యక్షులను కచ్చితంగా మార్చాలని టీపీసీసీ చీఫ్పట్టుమీదున్నారు. ఏండ్ల నుంచి పార్టీ పగ్గాలు చేతుల్లో పెట్టుకున్నారని, పార్టీ కార్యక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదని పార్టీ పెద్దలకు కూడా నివేదించినట్లు సమాచారం. దీంతో 11 జిల్లాల అధ్యక్షులను మార్చి, వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. అయితే, రేవంత్రెడ్డికి అనుకూలంగా ఉండే నేతలకే ఈసారి చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు.మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ బాధ్యతలను రేవంత్‌రెడ్డికి అప్పగించిన తర్వాత.. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 10 మందికి సీనియర్‌ ఉపాధ్యక్షులు, మరో 10 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. ఇంకా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. వీటితో పాటు మరో ఐదారుగురిని అధికార ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాలకు కూడా పూర్తి స్థాయి కమిటీలను నియమించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మాత్రమే జగ్గారెడ్డి కొనసాగుతున్నారు. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారనే కారణంతో ఆయనకు ఉన్న విధులను కత్తెర వేశారు.

 

 

 

కేవలం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాత్రమే ఉన్నారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలను మహేశ్ గౌడ్, గీతారెడ్డి తదితరులకు అప్పగించారు. జగ్గారెడ్డికి ఇంకా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.ఇప్పుడున్న కమిటీలకు అదనంగా మరో మూడు కమిటీలను వేయాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. ఆ కమిటీలను రాష్ట్ర కాంగ్రెస్‌లో కూడా వేయనున్నారు. పార్టీ అంతర్గత విషయాలు చర్చించేందుకు, పార్టీ శ్రేణులకు శిక్షణ కమిటీతో పాటు మీడియా, సోషల్‌ మీడియాకు అనుసంధానానికి గాను మరో కమిటీని నియమించారు. ఈ కమిటీల వల్ల పదవుల సంఖ్య కూడా పెరుగుతోందని భావిస్తున్నారు.ఇక టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ.. ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతున్నారు. రెండు రోజుల కిందట ఆయన రాహుల్‌ను కూడా కలిసినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల రేవంత్రెడ్డి చేసిన రెడ్డి రాజకీయంపై రాహుల్‌కు వివరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, దీనిపై రెండు వైపులా క్లారిటీ ఇవ్వలేదు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మధుయాష్కీ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.

 

Tags:Purgatory vibes in Congress