పుస్తకాలివ్వరా..?

Date:06/12/2018
గుంటూరు ముచ్చట్లు:
అకడమిక్‌ పుస్తకాలు కావాలని అరిచి గీపెట్టినా ఎంత మొరపెట్టుకున్నా వాటిని ఇండెంట్‌ మేరకు ఏ సంవత్సరమూ సరఫరా చేయరు. ఇప్పటికీ జిల్లాలో అనేకమంది ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థులకు సరిపడా పుస్తకాలు రాలేదని తరచుగా ఎంఈఓలకు మొరపెట్టుకుంటూనే ఉంటున్నారు. కానీ సర్వశిక్ష అభియాన్‌ మాత్రం ‘ఆనంద లహరి’ కార్యక్రమం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా పుస్తకాలు ముద్రించేసి పిల్లలకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాలను ఏం చేయాలో తెలియక  యంత్రాంగం మిన్నకుండిపోయింది. 1,2 తరగతుల పిల్లలకు ట్యాబ్‌ ఆధారిత పాఠ్యాంశాలు, 3,4,5 తరగతుల వారికి ఆటపాటలతో కూడిన విద్యా బోధన చేయాలని సరళ పదాలు, కఠిన పదాలు పలికించే పుస్తకాలు, బొమ్మలతో కూడిన పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పలు పేర్లతో పెద్ద సంఖ్యలో ముద్రించి పంపంగా వాటిని ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు యంత్రాంగం అందజేసింది. పిల్లలకు పంపిణీ చేయగా ఇంకా మిగిలాయి. ఈ పుస్తకాలు తమ వద్ద ఉంటే ఉన్నతాధికారులు ఎప్పుడైనా తనిఖీలకు వస్తే ఈపుస్తకాలు మీ వద్దకు ఎందుకు ఉంచుకున్నారు? మిగిలినవి ఎందుకు వెనక్కు పంపలేదని ప్రశ్నించి ఇబ్బంది పెడతారేమోనని జిల్లా సర్వశిక్ష అభియాన్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
 వేల సంఖ్యలోనే మిగిలిన పుస్తకాలను భద్రంగా దాచి ఉంచటానికి కార్యాలయానికి గోదాము సౌకర్యం లేదు. దీంతో వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక కార్యాలయంలో ఏ గదిలో ఖాళీ ఉంటే ఆ గదిలో పట్టిన వరకు చిందరవందరగా పడేశారు. వీటి ముద్రణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది. విచిత్రమేమంటే పుస్తక ముద్రణకర్తలకు ఇప్పటికే చెల్లింపులు సైతం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర కార్యాలయ ఉన్నతాధికారులు ఈ మిగులు పుస్తకాల గురించి నోరుమెదపటం లేదు. మరోవైపు కిందిస్థాయి అధికారులు మిగులు పుస్తకాల సమాచారం రాతపూర్వకంగానే ఉన్నతాధికారులకు తెలియజేశారు.
వాస్తవానికి ఈపుస్తకాలను విద్యా సంవత్సరం ఆరంభంలో అందిస్తే పిల్లలకు ప్రయోజనకరంగా ఉండేది. ఈ కార్యక్రమానికి గతేడాదే రూపకల్పన చేశారు. విద్యా  సంవత్సరం ఆరంభంలో అకడమిక్‌ పుస్తకాలతో పాటే వాటిని కూడా అందజేస్తే పిల్లలకు అభ్యసనా సామర్థ్యాలు ప్రణాళికా బద్ధంగా నేర్పించటానికి అవకాశం ఉండేది. విద్యా సంవత్సరం ప్రారంభించిన మూడు మాసాలకు పుస్తకాలను ఇవ్వటం వల్ల హడావుడిగా వాటిని పిల్లలకు నేర్పించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆలస్యంగా పుస్తకాలను ముద్రించి పంపటం అధికారుల నిర్వాకాన్ని తెలియజేస్తోంది.
జిల్లాలో ప్రతి మండలానికి రెండు పాఠశాలలను ఆనంద లహరి కార్యక్రమానికి ఎంపిక చేశారు. వీటికి ట్యాబ్‌లు సైతం అందించారు. ఆట్యాబ్‌లు సక్రమంగా పనిచేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పుస్తకాలు ముద్రించటానికి జిల్లా నుంచి ఇండెంట్‌ తీసుకుని అంతకు మించి పుస్తకాలు ముద్రించి పంపటం వెనక కమిషన్ల బాగోతమేనని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల్లో ఇంకెవరికైనా తగ్గితే వాటిని ఇవ్వాలని, తిరిగి పాఠశాలలకే పంపాలని సూచించటంతో వాటిని మండలాలకు ఎలా చేర్చాలి? రవాణాఛార్జీలు ఎవరు భరించాలని తర్జనభర్జన పడుతున్నారు. అకడమిక్‌ పుస్తకాలను తగ్గించి ముద్రించి అందజేసే పాఠశాల విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్‌కు చెందిన పుస్తకాలను ముద్రించటంలో ఎందుకు అదనంగా ముద్రించాల్సి వస్తోందనేది ప్రశ్నార్థకమవుతోంది. అకడమిక్‌ పుస్తకాలు తగ్గితే  పిల్లల నుంచి గతేడాదివి స్వాధీనం చేసుకుని వారికి అందజేయాలని ప్రధానోపాధ్యాయులకు సలహానిస్తున్నారు. ఎప్పుడైనా ఈ కార్యక్రమం ఆగిపోతే అదనంగా ముద్రించిన పుస్తకాలు వృథానే.
Tags:Pustakalivvara ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *