Quality drugs should be made available

నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలి 

Date:16/03/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యంత చౌకైన మరియు నాణ్యమైన మందులను అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడకుండా, నిబద్ధతతో ఔషధాలను తయారు చేయాలని ఫార్మా ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ విద్యాలయ ద్విదశాబ్ధి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన 10 మంది విద్యార్థినులకు ఉపరాష్ట్రపతి బంగారు పతకాలను అందజేశారు. 75 సంవత్సరాలుగా 18 విద్యా సంస్థల ద్వారా ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో, విద్యను అందిస్తూ, ముఖ్యంగా మహిళల విద్య మీద దృష్టి పెట్టిన ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు.
పరిశోధన,  ఆవిష్కరణ మీద విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
రోజురోజుకి కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయని, ప్రత్యేకించి జీవనశైలి, ఆహారం, ఒత్తిడి కారణంగా క్యాన్సర్ లాంటి సమస్యలు ముప్పిరిగొంటున్నాయని, వీటిని అధిగమించేందుకు తొలుత ఆహారం, జీవన విధానంలో మార్పు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జెనరిక్ ఔషధాల తయారీలో భారతదేశం అతిపెద్ద సరఫరా దారుగా నిలిచిందని, AIDS ని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న యాంటీ రెట్రో వైరల్ ఔషధాలను భారతీయ ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సరసమైన ధరలకు ఔషధాలు అందించి, ప్రాణాలను కాపాడుతున్న భారతీయ కంపెనీల యెమెన్ సర్వీసులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.    జెనరిక్ ఔషధాలను అందిచడంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రామాణిక మరియు భారతీయ వైద్య విధానాల మీద యువ పరిశోధకులు దృష్టి పెట్టాలని సూచించారు.
ఎలాంటి దుష్ప్రభావాలు లేని సంప్రదాయ ఔషధాల సామర్థ్యం, ప్రామాణికత మరియు సమర్థతను తెలియజేసేందుకు మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.  ఎక్కువ మందిని కబళిస్తున్న వ్యాధులకు తక్కువ ధరలో నాణ్యమైన మందులను అందుబాటులోకి తేవడమే కాకుండా, అరుదైన వ్యాధులను ఎదుర్కొనేందుకు సరికొత్త ఔషధాల అభివృద్ధి దిశగా దృష్టి పెట్టాలని, అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య 7 కోట్ల కంటే ఎక్కువగా ఉందన్న ఉపరాష్ట్రపతి, దీన్నో సేవా మార్గంగా చూడాలని ఫార్మా కంపెనీలను సూచించారు.
జనరిక్ ఔషధాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే వేగాన్ని మరింత పెంచడం మీద దృష్టి పెట్టాలని సూచించిన ఉపరాష్ట్రపతి, గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు, జీవితాన్ని కాపాడే మందులు, వ్యాధి నివారణ టీకాలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విధాన నిర్ణేతలు, ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాలు మరియు ఔషధ నిపుణులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మరింత మంది నిపుణుల్ని తయారు చేయవలసిన అవసరం ఉందని, దీన్ని యువత అంది పుచ్చుకోవాలని సూచించారు. మన యువతకు మెరుగైన భవిష్యత్ ను అందించేందుకు ప్రపంచ ప్రమాణాలతో భారతదేశంలో ఫార్మసీ విద్యను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
గత కొద్ది సంవత్సరాల్లో ఔషధ పరిశ్రమ రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని, ఇది మరింత వృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, 2020 నాటికి ఇది 55 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఫార్మా పరిశ్రమతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అభివృద్ధిని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వినియోగించుకోవాలని సూచించారు.
ఫార్మాస్యూటికల్ రంగం నిర్వహిస్తున్న కీలకమైన బాధ్యతలు మానవుల జీవితాలను కాపాడుతున్నాయని, మందులను కొనుగోలు చేసే శక్తి లేని వారికి, ఫార్మా కంపెనీలు తమ నియమ నిబంధనలను కాస్తంత మార్చుకుని, అందరికీ అందించే మరియు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహా విద్యాలయ ఛైర్మన్ శ్రీ.వి.వీరేందర్, కార్యదర్శి శ్రీ ఆర్. సుకేష్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:Quality drugs should be made available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *