నాణ్యత శూన్యం (కర్నూలు)

Quality null (Kurnool)

Quality null (Kurnool)

Date:06/10/2018
కర్నూలు ముచ్చట్లు:
నగరంలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పనుల్లో నాణ్యత
లేకపోవడంతో వేసిన కొన్నాళ్లకే గుంతల మయంగా మారాయి. కార్పొరేషన్ పరిధిలో 51 వార్డులున్నాయి. వీటితోపాటు విలీన గ్రామాలు మామిదాలపాడు, స్టాంటన్‌ పురం, మునగాలపాడు ఉన్నాయి. రహదారి విస్తరణ, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, రక్షణ గోడలు, డివైడర్లు, పార్కులు, మరుగుదొడ్లు, శ్మశానాలు ఇలా అభివృద్ధి చేసేందుకు నిధులు భారీగా కేటాయించారు.
సాధారణ నిధులతోపాటు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఎస్‌ఎఫ్‌సీ(స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌), అమృత్‌, 14వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించారు. గత మూడేళ్లలో 1472 నిర్మాణాలకు ఏకంగా రూ.386.51 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల పనులు సాగుతున్నాయి.
రోడ్ల పనుల్లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లదే హవాగా మారింది. పర్యవేక్షణ పడకేయడంతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ముందు ఉన్న రోడ్లు చదును చేసి సబ్‌గ్రేడ్‌, సబ్‌బేస్‌కు వాడాల్సిన కంకర, చిప్స్‌ వేయాల్సి ఉంది. గ్రావెల్‌ బదులు నాసిరకమైన మట్టి, బూడిదతో కూడిన(డస్ట్‌) వాడుతూ చేతులు దులుపుకొంటున్నారు. 2.30 మి.మీ. లోపల చిప్‌ డస్ట్‌ను తక్కువ ధరకు తీసుకొచ్చి వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
త్వరతిగతిన పనులు చేసి బిల్లులు చేసేందుకు కొందరైతే ఏకంగా వర్షంలోనే పనులు చేస్తూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. మరికొందరు ఎం-20, 30 గ్రేడ్‌లను బట్టి సిమెంట్‌ వాడాల్సి ఉండగా… పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు మిశ్రమాన్ని కలుపుతూ పైసలు మిగుల్చుకునే పనిలో పడ్డారు. రోడ్డు వాడే 20 మి.మీ. మెటల్‌ సైతం నాసిరకంగానే దర్శనమిస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో గుత్తేదార్లు మట్టి కుప్పలు రోడ్లపై వదిలి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇంత నాసిరకంగా పనులు జరుగుతున్న అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పొందుతూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ముడుపులు అందుతున్నట్లు సమాచారం. ఇలా 10-15 శాతం వరకు ఒక్కో అధికారిని బట్టి కమీషన్లకే ఇస్తుండటంతో ఇష్టమొచ్చిన రీతిలో పనులు చేసి కాంట్రాక్టర్లు మమ అనిపిస్తున్నారు. నాణ్యతా లోపంతో వేసిన రహదారులు నెలల వ్యవధిలోనే దెబ్బతింటున్నాయి.
ప్రభుత్వం కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ.కోట్లు కుమ్మరిస్తుంటే గుత్తేదార్లు లక్ష్యాన్ని దెబ్బతీసున్నారంటూ నాలుగో తరగతి కాలనీకి చెందిన పలువురు ధ్వజమెత్తుతున్నారు. నాసిరకం పనులపై ఇప్పటికే పలు కాలనీల్లో స్థానికులు నిలదీస్తున్నా తీరు మారడం లేదు. వేసిన సీసీ రోడ్లను పైపులైన్ల కోసం తవ్వి వదిలేస్తున్నారు.
Tags:Quality null (Kurnool)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *