క్వారీల్లో బాంబుల మోత

Quarries bombs swing

Quarries bombs swing

Date:17/09/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
 ఆదిలాబాద్ జిల్లాలో క్వారీల్లో నిత్యం పేలుళ్లు సంభవిస్తుండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. కొండలను పగులగొట్టేందుకు పేలుడు పదార్ధాలు పెద్ద మొత్తంలో వినియోగిస్తుండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పేలుళ్లు జరిపేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రక్షణ చర్యలు లేకుండా బ్లాస్ట్‌లు చేస్తుండడం సమస్యాత్మకంగా మారిందని అంటున్నారు. పేలుళ్ల సమయంలో అక్కడ పనిచేసే వారే కాకుండా చుట్టుపక్కల పొలాల్లోని రైతులు, కూలీలపై రాళ్లు పడుతున్నాయి.
ఇక రహదారులపై వెళ్లే వాహన చోదకులదీ ఇదే దుస్థితి. ఎప్పుడు ఎక్కడ పేలుడు జరుగుతుందో.. ఎటు నుంచి బండరాళ్లు వచ్చి మీదపడతాయో తెలీని పరిస్థితి. ఇలాంటి భయాందోళనల మధ్యే ఆ ప్రాంతంలో పలువురు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు బాంబుల మోతలతో సమీపంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. క్వారీల నిర్వాహకులపై నియంత్రణ పెద్దగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు.
నిర్వాహకులు పెద్దమొత్తంలో దండుకుంటున్నా నియంత్రణ చర్యలు లేకపోవడం శోచనీయమని అంటున్నారు. క్వారీ తవ్వకాల వల్ల రూ. లక్షలు ఆర్జిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్‌ లాంటి ప్రాంతాల్లో క్వారీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను లీజుకు తీసుకోవడంతో పాటు అసైన్డు భూముల్లో అనుమతులు తెచ్చుకుని తవ్వకాలు చేస్తున్నారు. బండలను పిండి చేయడానికి పేలుడు పదార్ధాలు విరివిగా వాడుతున్నారు. దీంతో స్థానికులకు కంటిమీద కునుకులేని పరిస్థితి.
జిల్లాలో ఎక్కువగా కంకర రహదారి క్వారీలు ఉన్నాయి. వీటి వ్యాపారం పెద్దమొత్తంలోనే జరుగుతుంది. ఇక్కడ రోజుకు రూ. 50 లక్షల మేర వ్యాపారం సాగుతుందని అంచనా. ఇదిలాఉంటే బండరాళ్లను చిన్నపాటి ముక్కలు చేసేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి. క్వారీల నిర్వాహకులు వీటిని లెక్క చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బండలను పేల్చేందుకు అత్యంత ప్రమాదకరమైన పవర్‌ బ్లాస్టింగ్‌లు, జిలెటిన్‌ స్టిక్స్‌ బూస్లర్లను వాడుతున్నారని చెప్తున్నారు.
భారీ పేలుడు జరగడంతో ప్రజలపైనే కాక మూగజీవాలపైనా దుష్ప్రభావం పడుతోంది. ఇప్పటికే స్థానికంగా పలు జంతువులు కనుమరుగయ్యాయి. ఇక శబ్ద కాలుష్యం వల్ల కలిగి చుట్టు పక్కల ఉన్న ఇళ్లు, పక్షులు, చెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువ లోతు వరకు బండరాయిని తవ్వడం వల్ల వ్యవసాయమూ ప్రభావితమవుతోంది. చుట్టు పక్కల బోర్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. నీటి కాఠిన్యత పెరుగుతోందని అంటున్నారు.
మరోవైపు.. పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరొచ్చి పొలాల్లో పడుతున్నాయి. ఆ సమయంలో రైతులు, కూలీలు ఉంటే వారు గాయాలపాలవుతున్నారు. ఇక క్వారీల్లో పెద్దపెద్ద బండలను తొలగించడంతో వర్షాకాలంలో చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే వీటిలో పడి ఇటీవల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వాస్తవానికి జనం ఉన్న ప్రాంతాలకు కనీసం కి.మీ. దూరంలో పేలుళ్లు జరపాలి. కానీ నిబంధనలు పట్టించుకోకుండా ఎక్కడికక్కడ బండరాళ్లను పేల్చేస్తుండడంతో నిత్యం భయాందోళనల మధ్యే జీవించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి క్వారీల్లో జరుగుతున్న పేలుళ్ల తీరుని పరిశీలించి.. నిబంధనలకు అనుగణంగా బ్లాస్టింగ్‌లు జరిపేలా చర్యలు తీసుకోవాలని నిజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Quarries bombs swing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *