Natyam ad

డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో ప్రశ్నలు సమాధానాలు

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి ఆలయ మాడవీధుల్లో మహా అంగప్రదక్షిణ చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా రాత్రివేళ పుష్కరిణిని తెరిచి ఉంచుతామని, తిరుమలనంబి ఆలయం వద్ద గేటు తీసి ఉంచి సెక్యూరిటి గార్డును ఏర్పాటు చేస్తామని టిటిడి ఈవో తెలిపారు. డ‌య‌ల్ యువ‌ర్  ఈవో  కార్య‌క్ర‌మం  శుక్రవారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు

Post Midle

1. ఖమ్మం – ప్రసాదరావు, శంకర్రావు – హైదరాబాద్, వాణి – చిత్తూరు.
ప్రశ్న : ఆన్లైన్లో దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం ప్రయత్నిస్తుంటే కావడం లేదు. వృద్ధులను, వికలాంగులను వేరువేరుగా దర్శనానికి పంపండి

ఈవో : ఎక్కువమంది భక్తులు ప్రయత్నిస్తుంటారు కాబట్టి అలా జరుగుతుంటుంది. మళ్ళీ ప్రయత్నించండి. నడవలేని వికలాంగులను బయోమెట్రిక్ ద్వారా కూడా పంపుతున్నాం

2. గోపిచారి – గుంటూరు
ప్రశ్న : టిటిడి వెబ్సైట్, మొబైల్ యాప్ చాలా బాగున్నాయి. శ్రీవారి సేవకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ప్రొఫైల్ ఫెయిల్ అని వస్తోంది. దీన్ని సరిచేయండి

ఈవో : మీకు ఫోన్ చేసి వివరాలు తెలియ చేస్తాం

3. అపర్ణ – అనంతపురం
ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్ లైన్ లో 2 మాత్రమే బుక్ అవుతున్నాయి. వాటిని 4కు పెంచండి

ఈవో : ఒక భక్తుడు అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో రెండు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ టోకెన్లు పొందలేని భక్తులు ఇతర విధానాల్లో దర్శనం చేసుకోవచ్చు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఆర్జిత సేవా టికెట్లు 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదేవిధంగా రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24న, గదుల కోటాను 25న విడుదల చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది

4. వేణు – తిరుపతి, లక్ష్మీనారాయణ – హైదరాబాద్.
ప్రశ్న : మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రత సరిగా లేదు. నందకంలో కళ్యాణకట్ట వద్ద శుభ్రత సరిగా లేదు

ఈవో : పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించడంతో సమస్య తలెత్తింది. వెంటనే ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేసి చక్కగా పారిశుధ్యాన్ని నిర్వహిస్తున్నాం

5. సరోజ – నంద్యాల, విజయలక్ష్మి – విజయవాడ, వెంకటరమణ -తూర్పుగోదావరి.
ప్రశ్న : తిరుమలలో గదులు బుక్ చేసుకున్నాము. రిఫండ్ కావడం లేదు

ఈవో: రిఫండ్ కి సంబంధించి ఇటీవల సమీక్ష నిర్వహించాం. మా దగ్గర ఎలాంటి పెండింగ్ లేదు. మరోసారి బ్యాంకులను సంప్రదించి రిఫండ్ అయ్యేలా చూస్తాం

6. శ్రీనివాస్ – చిలకలూరిపేట
ప్రశ్న : కళ్యాణోత్సవానికి పిల్లలను అనుమతి ఇస్తారా

ఈవో : శ్రీవారి ఆలయంలో కళ్యాణ మండపం వద్ద స్థలం తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ మందిని అనుమతించే అవకాశం లేదు. మైనర్లను మాత్రం తల్లిదండ్రులతో పాటు అనుమతిస్తాం

7. వెంకటేశ్వర్లు – పీలేరు
ప్రశ్న : కోవిడ్ సమయంలో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారికి బ్రేక్ దర్శనం టికెట్లు ఇస్తామని చెప్పారు. అలా కాకుండా అర్చన, తోమాల లాంటివి ఇవ్వండి

ఈవో : ఆర్జిత సేవా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ షెడ్యూల్ చేయడం కష్టమవుతుంది. తోమాల, అర్చన లాంటి సేవల కోసం లక్కీడిప్ లో ప్రయత్నించండి

8. జయశ్రీ – హైదరాబాద్
ప్రశ్న : మే నెలలో తిరుమలకు వచ్చాం. ఎండ వేడి కారణంగా రోడ్డుపై నడవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. మ్యాట్ వేయించండి

ఈవో : వేసవిలో శ్రీవారి ఆలయ మాడవీధులతోపాటు అవసరమైన ప్రాంతాల్లో కూల్ పెయింట్, మ్యాట్లు వేశాం. తరచుగా నీటితో పిచికారీ చేయిస్తున్నాం. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుతాం

9. సరస్వతి – హైదరాబాద్
ప్రశ్న : శేషాద్రి నగర్ ప్రాంతంలో గది తీసుకున్నాం. తాగునీరు, అన్నప్రసాదం ఏర్పాటు చేయండి

ఈవో : అన్ని ప్రాంతాల్లో గదుల వద్ద తాగునీటి వసతి కల్పించాం. తిరుమలలో ఐదు ప్రాంతాల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తున్నాం

10. లక్ష్మీనారాయణ – రాజమండ్రి
ప్రశ్న : ఎస్విబిసి శతమానం భవతి కార్యక్రమానికి ఫోటో పంపితే ఆశీర్వచనం ప్రసాదం పంపేవారు

ఈవో : మీతో మాట్లాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాం

11. నరసయ్య – అదిలాబాద్
ప్రశ్న : శ్రీవారి సేవాసదన్ లో రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతోంది

ఈవో : ఇకపై ఆ సమస్య లేకుండా చేస్తాం. శ్రీవారి సేవకులు చక్కగా సేవలు అందిస్తున్నారు. వేసవిలో రోజుకు మూడు వేల మంది సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో స్వచ్ఛందంగా రోజుకు 500 మంది సేవకులు పారిశుధ్య సేవ చేస్తున్నారు

12. వీరేష్ – బళ్ళారి
ప్రశ్న : గదుల వద్ద టిటిడి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది డబ్బులు అడుగుతున్నారు

ఈవో : భక్తుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న టిటిడి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్య సిబ్బందికి కూడా భక్తులు డబ్బులు ఇవ్వకండి

13. వంశీ – బాపట్ల
ప్రశ్న : అలిపిరి కాలి నడక మార్గంలో స్తంభాలకు గోవింద నామాలు ఉండేవి, తిరిగి రాయించండి

ఈవో : అలిపిరి కాలినడకమార్గం పునర్నిర్మించాం. నూతన స్తంభాలకు గోవింద నామాలు రాయిస్తాం

14. గుప్తా – ప్రకాశం
ప్రశ్న : ధర్మ ప్రచారం చేసేందుకు ప్రతి మండలంలో ఒక సేవా కేంద్రం పెట్టండి. మా ఫోన్ నెంబర్ కు కాల్ చేస్తే మరిన్ని విషయాలు తెలియజేస్తాం

ఈవో : హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నాం. డయల్ యువర్ కార్యక్రమంలో భక్తులు చేసిన సూచనలను విధిగా పాటిస్తున్నాం. సమస్యలను పరిష్కరిస్తున్నాం

15. లలిత – హైదరాబాద్
ప్రశ్న : టిటిడికి గోమాతను ఇవ్వాలనుకుంటున్నాం

ఈవో : గోశాల డైరెక్టర్ మీకు వివరాలు తెలిపి గోమాతను స్వీకరిస్తారు

16. శ్రీనివాస్ – కర్నూల
ప్రశ్న : భక్తుల రద్దీ లేకపోయినా క్యూ లైన్ లలో ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది

ఈవో : భక్తుల రద్దీని బట్టి భక్తులు క్యూ లైన్ లోకి ప్రవేశించే మార్గాలను మారుస్తూ ఉంటాం

17. అశోక్ – చెన్నై
ప్రశ్న : మహా అంగప్రదక్షిణ చేయడానికి ఇబ్బందికరంగా రాత్రివేళ పుష్కరిణిని మూసి వేస్తున్నారు, తిరుమలనంబి ఆలయం వద్ద గేటు వేస్తున్నారు

ఈవో: మహా అంగప్రదక్షిణ చేసే భక్తులకు స్నానానికి ఇబ్బంది లేకుండా రాత్రి వేళ పుష్కరిణిని తెరిచి ఉంచుతాం. తిరుమలనంబి ఆలయం వద్ద గేటు లేకుండా చూస్తాం

18. ప్రసాద్ రెడ్డి – ప్రొద్దుటూరు
ప్రశ్న : రూ.300/- టికెట్లు స్కానింగ్ పాయింట్ వద్ద తోపులాటను అరికట్టండి

ఈవో : పరిశీలించి తోపులాట జరగకుండా చూస్తాం

19. సునీత – రాజమండ్రి
ప్రశ్న : శ్రీవారి సేవకు ఆన్లైన్లో నమోదు చేసుకునే సమయంలో సభ్యులందరికీ పేర్లు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా సంఖ్య ఉండేలా చూడండి

ఈవో : శ్రీవారి సేవకు భక్తుల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తోంది. కొంతమంది సేవకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు సభ్యులందరి పేర్లు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నాం

20. అరుణ – ఒంగోలు
ప్రశ్న : ప్రతి ఏకాదశికి గీతా పారాయణం చేయించండి

ఈవో : ఎస్వీబీసీలో ప్రతిరోజు సాయంత్రం గరుడ పురాణంలో గీతా పారాయణం జరుగుతోంది. వెబ్సైట్లో సంపూర్ణ గీతా పారాయణం అందుబాటులో ఉంది

21. పార్థసారథి – విజయనగరం
ప్రశ్న : గదులు స్కాన్ చేసినప్పటినుండి కాకుండా తాళాలు ఇచ్చినప్పటినుంచి సమయం లెక్కించేలా చూడండి

ఈవో : పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం

22. వెంకట్ – కాకినాడ
ప్రశ్న : లడ్డూ నాణ్యత సరిగా ఉండడం లేదు. అన్నదానంలో బియ్యం నాణ్యత సరిగా లేదు

ఈవో : లడ్డూ తయారీకి నాణ్యమైన ముడి సరుకులను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. మరింత నాణ్యంగా ఉండేలా పోటు సిబ్బందికి సూచనలు ఇస్తాం. అన్నదానంలో నాణ్యమైన బియ్యాన్ని ఉపయోగిస్తున్నాం. భోజనం నాణ్యతను తరచూ పరిశీలిస్తున్నాం.

 

Tags: Questions answered on Dial Your Evo

Post Midle