Natyam ad

సీమ రైతులకు రబీ టెన్షన్

కర్నూలు ముచ్చట్లు:

రబీ పంటల సాగు రైతులకు గంగ బెంగ పట్టుకుంది. తెలుగు గంగ కింద సాగవుతోన్న పంటలకు ప్రభుత్వం ఏప్రిల్ 10 వరకు మాత్రమే నీరిస్తామని ప్రకటించింది. కనీసం ఏప్రిల్ చివరి వరకైనా నీరివ్వాలని, లేకుంటే పంటలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 10 వరకు సాగు నీరివ్వాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జలాశయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 7 నియోజక వర్గాలు, 489 గ్రామ పంచాయతీలు, 3.67 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రాయలసీమ జిల్లాలకు సాగు నీటి అవసరాలు తీర్చే తెలుగు గంగ లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. అందులో అంతర్భాగమైన జిల్లాలోని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద తెలుగు గంగ సాగు నీటిని అందించేందుకు అధికారులు జిల్లాల విభజన సమయంలో 1.14 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. అందులో రబీ సీజన్‌లో 84 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.ప్రస్తుతం రబీ సీజన్‌లో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద బండి ఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లోని 14 గ్రామాలైన వెలుగోడు, చిన్న దేవలాపురం, వెంగళరెడ్డి పేట, నారాయణపురం, మోత్కూరు, బోయరేవుల, సింగవరం, సోమయాజులపల్లి, ఈర్నపాడు, కడమలకాల్వ, తిమ్మనపల్లి, లింగాపురం తదితర గ్రామాల్లో దాదాపు 32 వేల ఎకరాల్లో వరి నారుమళ్లు, నాట్లు వేశారు. వెలుగోడు రిజర్వార్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

 

 

 

వేసవిలో తాగు నీటి అవసరాల కోసం 3 టీఎంసీలు వాడుకున్నా ఇంకా 9.500 టీఎంసీల నీటిని రబీ రైతులకు మే 10 వరకు నీటిని ఇవ్వవచ్చు.వరి సాగు కోసం దుక్కి మొదలుకొని ఎరువులు, మందులు, కూలీలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. ఇంకా మూడు నెలల కాల వ్యవధి ఉండడంతో మరో రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో అతివృష్టి, అనావృష్టి కారణంగా చాలా మంది రైతులు పంటలు నష్టపోయారు. కనీసం రబీ సీజన్‌లో ఐనా పంటల దిగుబడి వస్తుందనే ఆశతో బ్యాంకర్లు అప్పులివ్వకపోయినా వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. ఇంత చేసినా ఏప్రిల్ నెల చివర్లో నీరివ్వమని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు కలత చెందుతున్నారు.గతంలో ఇదే సమస్య తలెత్తింది. ఆ సమయంలో వెలుగోడు రిజర్వాయర్ లో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేది. అయినా రైతులు రబీలో వరి పంటలు సాగు చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయినా ఏప్రిల్ చివరి వరకు ఎందుకు నీరివ్వరని రైతులు ప్రశ్నిస్తున్నారు.

 

 

 

Post Midle

గతేడాది 18 కిలోమీటర్ల పొడవునా కాల్వ పనులు చేస్తున్నామని నీరివ్వలేదు. ఈ సారి కూడా నీరివ్వకపోతే 30 వేల ఎకరాల్లో సాగు చేసే రైతులు దాదాపు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అధికారులు మాత్రం 66 రోజుల పాటు వారబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తామని చెప్పడం రైతులను ఆందోళనలోకి నెట్టేసింది.రబీ రైతుల ఆయకట్టు రైతులకు ఏప్రిల్ చివరి వరకు సాగు నీరు అందితే రైతుల పంటలన్నీ చేతికందుతాయి. అధికారులు ప్రకటన చేసినట్లుగా నీరు విడుదల చేస్తే మాత్రం ఈ సారి కూడా రైతులు దాదాపు రూ.50 కోట్ల మేర నష్టపోయే ప్రమాదం ఉంది. రిజర్వాయర్‌లో 12.500 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు 3 టీఎంసీల నీరు అవసరం కాగా డెడ్ స్టోరేజీలో ఒక టీఎంసీ నిల్వ ఉంటుంది. అయినా రైతులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చు. కానీ ఏప్రిల్ 10వరకే నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పడం ఏంటని రైతులు వాపోతున్నారు.

 

Tags; Rabi tension for Seema farmers

Post Midle