రఫేల్ ఒప్పందంపై మరోసారి రగడ

Rafael Agreement once again
Date:12/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రఫేల్ ఒప్పందంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరేలా జాతీయ మీడియాలో వరుస సంచలన కథనాలు రావడంతో మరోసారి రగడ రాజుకుంది. ప్రస్తుతం ఈ కథనాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆయుధాలుగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ భద్రతను ప్రధాని మోదీ ఫణంగా పెట్టి, అనిల్‌ అంబానీకి మధ్యవర్తిగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని రాహుల్ మరోసారి నిలదీశారు. మోదీ ఓ అవినీతిపరుడిగా మారి, జాతీయ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని రాహుల్ ఆరోపించారు. రఫేల్‌ ఒప్పందానికి ముందు ఫ్రాన్స్‌ రక్షణమంత్రిని అనిల్ అంబానీ కలిసినట్లు తాజాగా ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. రాహుల్‌ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ ‌.. మోదీపై దుమ్మెత్తిపోశారు. రఫేల్‌ ఒప్పందం జరగడానికి పది రోజులు ముందు ఫ్రాన్స్‌ రక్షణమంత్రిని అనిల్‌ అంబానీ కలిశారని, ఆయన ఏ హోదాలో అక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. అనిల్‌ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని, దేశ రక్షణ వ్యవహారాల్లో రహస్యంగా ఉంచాల్సిన సున్నితమైన అంశాలను రాజీపడి ఇతరులకు చేరవేశారని, దీనికి మోదీ శిక్ష అనుభవించాల్సిందేనని రాహుల్‌ దుయ్యబట్టారు. రఫేల్‌ ఒప్పందం గురించి రక్షణశాఖ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, విదేశాంగ కార్యదర్శికి సమాచారం తెలియక ముందే అనిల్‌ అంబానీకి ఎలా చేరిందని ప్రశ్నించారు. నాటి రక్షణ మంత్రి కూడా ఈ ఒప్పందం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనమని అన్నారు. అంతేకాదు, రఫేల్‌ ఒప్పందం విషయంలో కాగ్‌ ఆడిట్‌ నివేదికపై కూడా రాహుల్‌ విమర్శలు గుప్పించారు. కాగ్‌ నివేదికకు ఎలాంటి విలువ లేదని, అది చౌకీదార్‌ ఆడిట్‌ జనరల్‌ రిపోర్ట్‌ అని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీపీ) వేయాలని మరోసారి డిమాండ్ చేసిన రాహుల్, రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు కూడా సందిగ్ధంలో పడేసింది. ఒకవేళ ప్రధానికి ఈ ఒప్పందంలో ఎలాంటి పాత్ర లేకపోతే జేపీసీ వేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.
Tags:Rafael Agreement once again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *