ఉత్తరాదిపైనే రాహుల్ గురి

-దక్షిణాది భారం బాబు పైనే
Date:15/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీయాలంటే తొలుత జాతీయ కూటమి ఏర్పాటు కన్నా వివిధ రాష్ట్రాల స్థాయుల్లో పొత్తులు కుదుర్చుకోవడమే మేలన్న అభిప్రాయం వివిధ విపక్ష నేతల్లో వ్యక్తమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బాబుపైనే కాంగ్రెస్ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి మరింత బలోపేతం అవుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో తెలంగాణలో మినహా కాంగ్రెస్ కొద్దిగా స్థాయి ఉన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకోలేకపోయింది.ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ బీఎస్పీతో కలసి వెళ్లాలని తొలుత నిర్ణయించింది.
ఆ పార్టీతో చర్చలు కూడా ప్రారంభించింది. అయితే సీట్ల పంచాయతీ పొత్తుకు విఘాతం ఏర్పడింది. దీంతో మాయావతి పార్టీ ఛత్తీస్ ఘడ్ లో అజిత్ జోగీతోనూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. దళిత ఓట్లు చీలకుండా బీఎస్పీని దరిచేర్చుకుందామన్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదు.
అయితే సర్వే ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుండటంతో కొంత ఊపిరి పీల్చుకుంది.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుందన్న సంకేతాలు దేశ వ్యాప్తంగా వెళతాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా లోక్ సభ ఎన్నికల నాటికి తమ దరి చేరతాయని భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పొత్తుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ మిత్రులను ఎక్కువగా సంపాదించుకుంది. వీరు బీజేపీపైనా, నరేంద్ర మోదీపైనా వ్యతిరేకతతో ఉండటం కలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ, డీఎంకే, జేడీఎస్ లతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలసి వెళ్లి దక్షిణాదిన కమలం పార్టీ ఊసే లేకుండా చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహం కొద్దిగా ఫలించేలా ఉంది.ఇక ఉత్తరాదినే అసలు సమస్య.
మాయావతి, శరద్ పవార్, మమత బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ లాంటి ఉద్దండులున్నారు. వీరితో పొత్తులు అంత ఆషామాషీ కాదు. ఎక్కువ స్థానాలను పొత్తుల్లో వదులుకోవాల్సి వస్తోంది. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా సీట్ల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాలన్నది .
కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. యూపీలో ఎటూ కాంగ్రెస్ కు బలం లేదు. మిగిలిన మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పొత్తులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. అందుకోసమే రాష్ట్రాల వారీగా కూటములు తొలుత ఏర్పాటు చేస్తే ఆ తర్వాత పని సులువవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
Tags: Rahul aimed at the north

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *