రాహుల్ వచ్చాడు..వెళ్లాడు 

Rahul arrived ..

Rahul arrived ..

Date:15/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమయిందా? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందా? అవుననే తెగ సంబరపడి పోతున్నారు హస్తం పార్టీ నేతలు. కాని తెలంగాణ పర్యటనలో రాహుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేయడం పార్టీకి లాభం చేకూర్చేనా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. రాహుల్ తన రెండు రోజుల పర్యటనలో సెటిలర్లు ఎక్కువగా ఉండే శేర్ లింగంపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు. మరుసటి రోజు మీడియా ఎడిటర్లతో ముచ్చటించారు.
పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశాల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచనల మేరకే రాహుల్ గాంధీ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావించారంటున్నారు. సెటిలర్లను ఆకట్టుకోవడానికే రాహుల్ ప్రత్యేక హోదా అంశాన్ని తెలంగాణ గడ్డపై చెప్పారు. శేర్ లింగంపల్లి బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా వేదికపై కన్పించారు.
అయితే సెటిలర్లు ఎంతవరకూ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారన్నదే ఇప్పుడు ప్రశ్న. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాను ఖచ్చితంగా ఇస్తామని ఆయన చెప్పడాన్ని కొందరు స్వాగతిస్తున్నా అది ఓట్ల వర్షం కురిపిస్తుందా? అన్న అనుమానం నేతల్లో లేకపోలేదు.తెలంగాణలో సెటిలర్లు కొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. వారి ప్రభావం దాదాపు 30 నియోజకవర్గాల్లో ఉంటుంది. కాని గత నాలుగున్నరేళ్లుగా సెటిలర్లు తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ఇబ్బంది పడిన సంఘటనలు జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కొన్ని చోట్ల అనుమతిలేని నిర్మాణాలను తొలగించినా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు.
ఉద్యమ సమయంలో భయపడినట్లుగా ఈ నాలుగున్నరేళ్లలో ఏం జరగలేదన్నది సెటిలర్ల అభిప్రాయం. ప్రభుత్వం కూడా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించడం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 99 వార్డులు దక్కాయన్నది కూడా కాదనలేని వాస్తవం.సెటిలర్లకు ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఎప్పుడో ఇక్కడకు వచ్చి స్థిరపడిపోయిన ఆంధ్రా సెటిలర్లు కొత్త రాష్ట్రం ఏర్పడినా అక్కడ స్థిరపడటానికి మొగ్గు చూపలేదు. స్థానికతను తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెడ్ లైన్ విధించినా పెద్దగా స్పందించలేదు.
ఎక్కువ మంది సెటిలర్లు తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణాలోనే స్థానికులుగా ఉండేందుకు మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సెటిలర్లను ఆకట్టుకునేందుకు ఏపీకి ప్రత్యేక హోదా ఎంతవరకూ ఉపయోగపడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
Tags :Rahul arrived ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *