సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న రాహుల్ 

Rahul is a self-goal goal

Rahul is a self-goal goal

 Date:16/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీకి మేలు చేస్తాయా? విపక్షాలన్నింటితో కలసి బీజేపీని ఓడిస్తామని, మోదీ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారంటున్న వ్యాఖ్యలు ఆయన బేల తనానికి నిదర్శనమంటున్నారు. కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమి పాలవుతుందని రాహుల్ చెప్పడం లేదు.
ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో కలసి బీజేపీని ఎదుర్కొంటామని, బీహార్ లో ఆర్జేడీతో కలసి మోదీని మట్టికరిపిస్తామని చెబుతున్న రాహుల్ వ్యాఖ్యలు ఆచరణ సాధ్యమేనా అన్న సందేహం వ్యక్తమవుతుంది. రాహుల్ వ్యాఖ్యల్లో అపరిపక్వత కన్పిస్తోంది.2019 ఎన్నికల్లో మోదీ వర్సెస్ రాహుల్ అని ఉండాల్సిన పోటీని ఎన్నికలకు ఏడాది ముందుగానే రాహుల్ స్వయంగా మార్చేయడం ఆయన స్వయంకృతాపరాధమంటున్నారు.
వాస్తవానికి గత ఎన్నికల నాటితో పోలిస్తే మోదీ ఇమేజ్ తగ్గిన మాట వాస్తవమే. నోట్ల రద్దు, జీఎస్టీ, నల్లధనం వెలికి తీస్తామని చెప్పడం వంటి హామీల కారణంగా మోదీ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. అయితే దీనిని క్యాష్ చేసుకోవాల్సిన సమయంలో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తాయంటున్నారు.
రాహుల్ వ్యాఖ్యల కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిన్నా చితకా పార్టీలు కూడా పొత్తు విషయంలో ఎక్కువ సీట్లు అడిగే ప్రమాదముందన్న ఆందోళన పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. ఒకపక్క పొత్తుల విషయం స్థానిక పీసీసీ నాయకత్వానికే అప్పగిస్తానని చెబుతూనే, మరొక పక్క ఫలానా రాష్ట్రంలో ఆ పార్టీలతో పొత్తు ఉంటుందని చెప్పడం కూడా కాంట్రవర్సీ అవుతుంది.
ఒకవేళ కిచిడీ ప్రభుత్వం ఏర్పడినా అది ఎక్కువ కాలం ఉండదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మాయావతి, మమత బెనర్జీ వంటి నేతలను పక్కన పెట్టుకుని అధికారాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదన్న వాదన కూడా ఉంది.ఇదిలా ఉంటే మోదీ పార్టీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్న సర్వేలు వస్తున్నాయి. మోదీ పార్టీకి, మిగిలిన పార్టీలకు మధ్య తేడా స్వల్పంగానే ఉంటుందని వార్ రూం స్ట్రాటజీ అండ్ ఉటోపియా సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది.
భారతీయ జనతాపార్టీకి 227 స్థానాలు, కాంగ్రెస్ కు 78 స్థానాలు దక్కుతాయని ఆ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. మిగిలిన అన్ని పార్టీలకు కలుపుకుని 238 సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. పార్లమెంటు ఎన్నికల నాటికి మోదీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అంటే పూర్తిస్థాయి మెజారిటీకి కావాల్సిన యాభై సీట్లను మోదీ తన మ్యాజిక్ తో ఎన్నికల నాటికి సాధించగలిగితే మళ్లీ కమలం పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. మొత్తం మీద రాహుల్ వ్యాఖ్యలు మోదీకి మేలు చేస్తాయనే వారే ఎక్కువగా కన్పిస్తున్నారు.
Tags:Rahul is a self-goal goal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *