రాహుల్.. పోటీ ఎక్కడ నుంచి…

న్యూఢిల్లీ ముచ్చట్లు:


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. ఇక ఇప్పుడు దేశంలోని అన్ని పార్టీల దృష్టి మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై పడింది. దేశంలోని జాతీయ హోదా కల్గిన ప్రధాన రాజకీయ పార్టీలు, కూటములు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈసారి ఎక్కణ్ణుంచి పోటీ చేస్తారన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీతో పాటు కేరళలోని వాయనాడ్‌లో పోటీ చేశారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే అమేఠీలో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా, వాయనాడ్‌లో గెలుపొంది పరవు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన తర్వాత.. రాహుల్ గాంధీకి మిత్రపక్షాలు, రాజకీయ విశ్లేషకులు సహా సమాజంలోని వివిధ వర్గాల నుంచి అనేక సలహాలు, సూచనలు అందుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ ఎక్కణ్ణుంచి పోటీ చేయాలన్న విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా సలహాలిస్తున్నారు.రాహుల్ గాంధీ ఈసారి కేరళ (వాయనాడ్) నుంచి కాకుండా హిందీ బెల్ట్ రాష్ట్రాలుగా పేరొందిన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా సూచిస్తున్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బలమైన శక్తిగా మారిన బీజేపీకి వీలైనంత గట్టి కౌంటర్ ఇవ్వాలంటే రాహుల్ గాంధీ అక్కణ్ణించి పోటీ చేయడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడుతున్నారు.

 

 

 

 

I.N.D.I.Aకూటమిలో మిత్రపక్షంగా ఉన్న సీపీఐ చేస్తున్న ఈ సూచనకు కారణం.. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు రెండూ బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమిలోనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) బలమైన పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల విషయంలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య వైరం ఉంటుంది తప్ప లోక్‌సభ ఎన్నికలకు ఈసారి ఎలాగూ కలిసే పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ అక్కడ పోటీ చేసినా చేయకపోయినా ఎవరికీ వచ్చే నష్టమూ లేదు, అదనంగా ఒనగూరే ప్రయోజనమూ లేదు. అందుకే ఉత్తర్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తే బీజేపీకి వ్యతిరేకంగా గట్టి పోటీ ఇవ్వవచ్చన్నది డి. రాజా మనోగతం. అంతేకాదు, పదేళ్ల బీజేపీ పాలనపై ఏర్పడే వ్యతిరేకత, కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు తోడయ్యే మిత్రపక్షాల ఓట్లు.. అన్నీ కలగలిసి బీజేపీ ఖాతాలో పడే సీట్లను లాక్కోవచ్చు అనే వ్యూహం కూడా ఇందులో దాగి ఉంది.డి. రాజా ఈ మాట చెప్పడానికి కూడా కారణం ఉంది. 2014లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌‌లో వడోదరతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసి నుంచి కూడా పోటీ చేశారు. రెండు చోట్లా గెలుపొందిన ఆయన వారణాసి సీటులో ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకుని, వడోదర వదులుకున్నారు. మోదీ పోటీ చేయకముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభావం అంతగా ఉండేది కాదు. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండేది. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ ఒక్కటే కాదు పక్కనే ఉన్న బిహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై కూడా ప్రభావం పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీ ఏకంగా 73 సీట్లు గెలుపొంది ప్రతిపక్షాలను మట్టికరిపించింది. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న

 

 

 

నేత పోటీ చేయడం కారణంగా ఆ నియోజకవర్గంతో పాటు యావత్ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. రాహుల్ గాంధీ కూడా 2019లో ఇదే సూత్రాన్ని అనుసరించి అమేఠీ (యూపీ)తో పాటు వాయనాడ్ (కేరళ)లో కూడా పోటీ చేశారు. దేశం మొత్తమ్మీద 52 సీట్లు మాత్రమే గెలుచుకోగా.. అందులో అత్యధికంగా 15 సీట్లు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వచ్చాయి. అందుక్కారణం రాహుల్ గాంధీ ఆ రాష్ట్రం నుంచి పోటీ చేయడమే.ఇప్పుడు దక్షిణాదిన ఇండియా కూటమి బలంగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి అసలు పట్టు లేదు. బలం పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ అక్కడ పోటీ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదు. అందుకే ఉత్తరాదిన పోటీ చేసి, బీజేపీ జైత్రయాత్రకు బ్రేకులు వేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సూచిస్తున్నారు.రాజా సూచన సంగతి సరే.. ఆయన చెప్పినట్టు ఉత్తరాదిన ఎక్కడో ఒక చోట నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే.. ఆ సీటు కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే ఆయన పార్లమెంటులోకి అడుగు పెట్టడానికి కూడా వీలుకాదు. అంటే ఆయన గెలుపుపై గ్యారంటీ ఇచ్చే ఒక సేఫ్ సీట్ కావాలి. కంచుకోట అనుకున్న అమేఠీలోనే బీజేపీ పాగా వేయగలిగింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ ఉత్తరాదిన ఎక్కణ్ణుంచి పోటీ చేసినా సరే.. బీజేపీ ఆ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టి, అస్త్ర, శస్త్రాలన్నీ ప్రయోగించి ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. అదే బీజేపీకి పెద్దగా పట్టులేని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసినా సరే వారి పప్పులు ఉడకవు అన్న అభిప్రాయం రాహుల్ గాంధీ కోటరీలో ఉంది. అందుకే ఈసారి కూడా ‘వాయనాడ్‌’ను సేఫ్ సీటుగా ఉంచుకుని, ఉత్తరాదిన మరో సీటు చూసుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఈసారి వయోభారం, అనారోగ్యం రీత్యా సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కొందరు సూచిస్తున్నారు.

 

 

 

తద్వారా రెండు చోట్ల గెలిస్తే దక్షిణాది సీటు వదులుకోవచ్చని, అక్కడ ఉప-ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలిచే అవకాశం ఉండదు అన్నది రాజకీయ వ్యూహకర్తల అభిప్రాయం. ఇది ప్లాన్-ఏ.ఒకవేళ ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే.. సోనియా గాంధీ సీటును ఆమెకు ఇవ్వొచ్చు. అలాంటప్పుడు యూపీలో మరేదైనా బలమైన సీటులో పోటీ చేయాల్సి ఉంటుంది. అమేఠీలో బీజేపీ గెలుపొందిన తర్వాత ఆ ప్రాంతంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లను తమ వైపు కట్టిపడేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూపీలో బలమైన ప్రాంతీయ పార్టీ సమాజ్‌వాదీ (ఎస్పీ)తో పొత్తు కుదిరితే.. వారి సాంప్రదాయ ఓటర్లైన యాదవులు, బీజేపీ వ్యతిరేక ఓటర్లైన ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆజంగఢ్, జౌన్‌పూర్ లేదా ఘాజీపూర్‌లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే సులభంగా గెలుపొందుతారన్నది ప్లాన్-బీ గా కనిపిస్తోంది.ఈ రెండూ కాదు.. అసలు సేఫ్ సీటు కోసం వెతుక్కోవాల్సిన ఖర్మ మనకేంటి అనుకుంటూ ఓడిన చోట గెలుపొందాలి అన్న ఉద్దేశంతో అమెఠీలోనే పోటీకి సిద్ధపడాలని క్యాడర్ నుంచి వస్తున్న సూచన. లేదంటే రాహుల్ పారిపోయాడు అంటూ బీజేపీ ఎద్దేవా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అక్కణ్ణంచే మళ్లీ పోటీ చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు కూడా స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు అని కొందరు నేతలు చెబుతున్నారు. ఏదేమైనా లోక్‌సభ ఎన్నికలకు అటూ ఇటుగా మరో 4-5 నెలల సమయం ఉంది. ఈలోగా సమీకరణాలు మారిపోవచ్చు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని పార్టీలో కొందరు సీనియర్లు అంటున్నారు. దీంతో రాహుల్ పోటీ ఎక్కణ్ణుంచి అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడే దొరికేలా కనిపించడం లేదు.

 

Tags: Rahul.. Where does the competition come from?

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *