రాహులా… ఇది తగునా

Date:26/11/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు కావాల్సి ఉంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నప్పటికీ ఆమె నామమాత్రమే అని చెప్పుకోవాలి. కేవలం నిర్ణయాలకే పరిమితమయ్యారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. రాహుల్ గాంధీ తాను ఏఐసీసీ అధ్యక్ష పదవిని తీసుకోనని భీష్మించుకు కూర్చున్నారు. మరోవైపు రాహుల్ అధ్యక్ష్య పదవిని చేపట్టాలని సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ నేతలు వత్తిడి తెస్తున్నారు.ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అసంతృప్త నేతలు సోనియాగాంధీకి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత వీరు మరోసారి అసంతృప్త గళాన్ని వినిపిస్తున్నారు. కపిల్ సిబాల్, చిదంబరం వంటి వారు పార్టీని క్షేత్రస్థాయిలో బలపర్చాల్సిందేనని గట్టిగా వ్యాఖ్యానిస్తున్నారు. బీహార్ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శనకు కారణాలను విశ్లేషించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

నిజానికి బీహార్ ఎన్నికల తర్వాత ఏఐసీసీ సదస్సును నిర్వహిస్తామని కాంగ్రెస్ అధిష్టానం అప్పట్లో పేర్కొంది. అయితే రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతుండటంతో ఏఐసీసీ సదస్సు ఎప్పుడనేది క్లారిటీ లేదు. సదస్సు జరిగితేనే సంస్థాగత మార్పులు చోటు చేసుకునే అవకాశముందంటున్నారు. లేకుంటే చిన్న పార్టీలకంటే హీనంగా కాంగ్రెస్ పరిస్థితి మారిపోతుందన్న ఆందోళన అధికమవుతుంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి.దీంతో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ నాయకత్వం వహించకపోతే ఎన్నికల ఫలితాల సంగతి పక్కన పెడితే అక్కడ సీట్ల సర్దుబాటులో కూడా కాంగ్రెస్ కు అన్యాయం జరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా బెట్టు వీడి రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. మరి రాహుల్ గాంధీ ఎంతవరకూ అంగీకరిస్తారో? లేదో? చూడాలి.

ఊహించని మనిషికి పదవి 

Tags: Rahula … this is appropriate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *