రైల్వే జోన్ లింక్ మరో అడ్డంకి

Date:15/02/2018
విజయవాడ ముచ్చట్లు:
రైల్వే జోన్ వస్తుందో? రాదో? తెలియదు కానీ దీనిపై గత కొద్ది రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విభిన్న ప్రకటనలతో జనం అయోమానికి గురవుతున్నారు. రైల్వే జోన్ విశాఖకు వచ్చేస్తోందని నిన్న మొన్నటి వరకూ కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రకటనలు చేశారు. ఇంకేముంది? విశాఖకు జోన్ వచ్చేసిందని అంతా భావించారు. ఢిల్లీలోని తాజా పరిస్థితులను పరిశీలిస్తే, రైల్వే జోన్ విశాఖ వరకూ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అది విజయవాడ వరకూ వచ్చి ఆగిపోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి రైల్వే జోన్ ఇచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను తెలియచేయాలని, కమిటీ వేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చేందుకు అవకాశం లేదని కమిటీ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఎంపీ హరిబాబు కూడా ధృవీకరించారు. అయినప్పటికీ, జోన్ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడం వలన, ఒడిశాలో బీజేపీకి రానున్న ఎన్నికల్లో తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు బహిర్గతం చేయడం లేదు. అయితే, గత నెలలో రైల్వే బోర్డు చైర్మన్ లోథాని విశాఖకు వచ్చినప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వలన ఒడిశాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే, జోన్ విషయంలో రాజకీయ ప్రకటనే జరగాలని ఆయన తేల్చి చెప్పారు. దీన్నిబట్టి, రైల్వే జోన్ విషయంలో విశాఖ ప్రజలు ఎంత సెంటిమెంట్‌తో ఉన్నారో, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకూడదని ఒడిశా నేతలు కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. దక్షిణ కోస్తాకు చెందిన ఎంపీలు అడ్వాంటేజ్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇచ్చే జోన్ ఏదో విజయవాడ లేదా గుంటూరు కేంద్రంగా ఇవ్వాలని లాబీయింగ్ నడుపుతున్నట్టు తెలిసింది. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం వలన గుంతకల్ ప్రాంతానికి చెందిన వారు విశాఖ వరకూ వెళ్లడం వరకూ సాధ్యం కాదన్న వాదనను మళ్లీ తెరమీదకు తీసుకువస్తున్నట్టు తెలిసింది. రెండేళ్ల కిందట సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ విషయాన్ని విశాఖ నేతలకు తెలియచేశారు. వెంటనే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేయడంతో ఆ ప్రకటన కాస్తా నిలిచిపోయింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రైల్వే జోన్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించలేదని ఇక్కడి ప్రజలు, నాయకులు మండిపడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌పై బీజేపీయేతర పార్టీలన్నీ రాష్ట్ర బంద్ పాటించాయి. ఏపీకి జోన్ కేటాయించలేదన్న అపవాదు నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో రెండేళ్ల కిందటి ప్రతిపాదనకే మళ్లీ పదును పెడుతున్నట్టు తెలిసింది. విజయవాడ కేంద్రంగా జోన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెర వెనుక నుంచి సహకరిస్తున్నట్టు కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సీఎం చంద్రబాబు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అదే జరిగితే, విశాఖ వాసులను ఏదో విధంగా మభ్యపెట్టి, జోన్ విజయవాడలోనే ఉండేట్టు చంద్రబాబు ప్రయత్నించవచ్చని వారు అంటున్నారు.విజయవాడ కేంద్రంగా జోన్ వస్తే, విశాఖ ప్రజల మనోభావాలు ఖాయంగా దెబ్బతింటాయన్న విషయం కేంద్రానికి తెలియంది కాదు. జోన్ ఇచ్చేసి చేతులు దులుపుకోవాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే, రాష్ట్రంలో చిచ్చు రగిలే అవకాశం ఉంది.రైల్వే జోన్‌పై కేంద్రంలో మారుతున్న పరిణామాలను గమనిస్తున్న వామపక్ష పార్టీలు బుధవారం నుంచి మళ్లీ ఆందోళనకు దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
Tags: Railway zone link is another obstacle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *