వర్షపు నీళ్లు తాగి బతికాం

Rain water is drinking

Rain water is drinking

Date:19/07/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
థాయ్ గుహ నుంచి సురక్షితంగా బయటకొచ్చిన బాలలు తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలురు చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు చెప్పారు. గుహలోని రాళ్ల నుంచి కారుతున్న వర్షపు నీరు తాగి తొమ్మిది రోజుల పాటు ప్రాణాలను నిలబెట్టుకున్నామని వారు చెప్పారు. అదొక భయానక అనుభవం అని ఓ బాలుడు భావోద్వేగంతో చెప్పాడు. థాయ్ గుహలో చిక్కుకొని చిమ్మచీకటిలో దాదాపు 18 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలురు, వారి కోచ్‌ అంతర్జాతీయ గజ ఈతగాళ్లు, సీల్స్ చేపట్టిన సహాయక కార్యక్రమాల ద్వారా సురక్షితంగా గుహ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ బాలురు తొలిసారిగా మీడియా ముందుకు వస్తున్న విషయం తెలిసి జనం భారీగా గుమిగూడారు. ఓపెన్ టాప్ జీప్‌లో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తుండగా వారంతా వేదికపైకి చేరుకున్నారు. గుహ నుంచి క్షేమంగా బయటకు రావడం నిజంగా ఓ అద్భుతమని థాయ్ బాలలు చెప్పారు. ‘ఫుట్‌బాల్‌ సాధన చేసిన తర్వాత గుహను చూసి ఓ గంట సేపు అక్కడ సరదాగా గడుపుదామని వెళ్లాం. కానీ, వర్షపు నీరు ఎక్కువగా రావడం వల్ల బయటకు రాలేకపోయాం. గుహ నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గాన్ని తవ్వేందుకు ప్రయత్నించాం. కానీ కుదరలేదు. మమ్మల్ని కాపడటానికి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారనే నమ్మకంతోనే ఎదురుచూశాం’ అని వారు చెప్పారు. మీ తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘తల్లిదండ్రులందరినీ క్షమాపణలు కోరుతున్నాం. గుహ చూసేందుకు వెళ్తామని మేం ఎవరమూ ఇంట్లో చెప్పలేదు. ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ అని మాత్రమే చెప్పాం’ అని బదులిచ్చారు. ఇంటికి వెళ్లగానే తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆరగించేస్తామని చెప్పారు. మీడియా సమావేశానికి వచ్చిన చిన్నారులు వేదికపై కొద్దిసేపు ఫుట్‌బాల్‌ ఆడారు.థాయిలాండ్‌ గుహ నుంచి బ‌య‌ట‌ప‌డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలలను జులై 19న ఇళ్లకు పంపిస్తామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గ‌త శనివారం వెల్లడించిన విష‌యం తెలిసిందే. పూర్తిగా కోలుకోక‌ముందే మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తే.. గుహలో జరిగినవి పదే పదే గుర్తు చేసుకోవాల్సి వస్తుందని, దానివల్ల మానసికంగా బలహీనపడతారని వైద్యులు సూచించారు. వైద్యుల సలహాత మీడియా ప్రతినిధులకు కూడా కొన్ని సూచనలు ఇచ్చి వారిని బయటకి తీసుకొచ్చారు. తమను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన డైవర్లకు చిన్నారులు కృతజ్ఞతలు చెప్పారు. వాళ్లను కాపాడేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన డైవర్‌ను ‘కింగ్‌ ఆఫ్‌ ది కేవ్‌’గా అభివర్ణించారు. ఆయనకు నివాళులర్పించారు.
వర్షపు నీళ్లు తాగి బతికాం https://www.telugumuchatlu.com/rain-water-is-drinking/
Tags:Rain water is drinking

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *