ఉత్తరాదిని వణికిస్తున్న వానలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:


ఢిల్లీ శివార్లలో కుండపోత వర్షం దంచికొట్టింది. హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే జలమయమైంది. రోడ్లని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పలు వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రయాణికులు నడుంలోతు నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్లారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలతో జనజీవితం అస్తవ్యస్ధంగా మారింది. ఫిరోజాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అపారనష్టం జరిగింది. వందలాది వాహనాలు వరదనీటిలో మునిగిపోయాయి.ఇటావాలో ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లక్నోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.అటు ఉత్తరాఖాండ్‌లోను భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.

 

 

కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో జాతీయ రహదారి 109పై కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ ఘటనతో జాతీయ రహదారి 109 బ్లాక్‌ అయ్యింది. రెండు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. కేదార్‌నాథ్ వైపు వెళ్లే యాత్రికులను నిలిపివేశారు. కొండచరియల శిథిలాలను తొలగించిన తర్వాత వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్‌ చెప్పుకొచ్చారు.ఇక జమ్మూలోను భారీ వర్షాల దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. జమ్మూ- శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.

 

Tags: Rains shaking the north

Leave A Reply

Your email address will not be published.