వానా కాలం ఇబ్బందులు షురూ…
అదిలాబాద్ ముచ్చట్లు:
వానాకాలం ప్రారంభమైందంటే చాలు ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీవాసులు ఆందోళనకు గురవుతుంటారు. భారీ వర్షం కురిసిందంటే లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోతాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి ఇబ్బందుల పాలవటం ఏటా ఆనవాయితీగా మారింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే పురపాలక సంఘం ముందస్తు చర్యలు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఏటా వర్షాకాలంలో పట్టణంలోని పలు కాలనీలు వరదమయమై కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలక వర్గ సభ్యులకు ఇదేమీ పట్టనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పట్టణంలో మిషన్ భగీరథ పనులు చేపట్టడానికి రహదారులన్నీ తవ్వేశారు. దీంతో చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతున్నాయి. కనీసం కాలినడకన వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. పురపాలక సంఘం మాత్రం మురుగు కాలువల్లో పూడిక తొలగించామని చెప్పి చేతులు దులిపేసుకుంటోంది. వర్షాకాలంలో బురదమయంగా మారిన రహదారులపై మట్టి వేయటానికి, అవసరమైన చోట జేసీబీ యంత్రంతో పనులు చేయటానికి ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో రూ.4 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ ప్రతిపాదనలను పాలక మండలి సభ్యులు తిరస్కరించారు. దీంతో పుర ప్రజలపై పాలక మండలి సభ్యులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ఈ ప్రతిపాదన తిరస్కరణకు గురవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులో పడిపోయారు.భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి రూ. 4 లక్షలతో పాలక మండలి సమావేశంలో ప్రతిపాదించాం. వర్షాకాలంలో బురదమయ్యే రహదారులపై మట్టి వేయటానికి, నీళ్లు నిల్వ అయి ఇబ్బందులు తలెత్తితే జేసీబీ సాయంతో తొలగించటానికి వీటిని ప్రతిపాదించాం. కానీ సభ్యులు ఈ ప్రతిపాదనలు తిరస్కరించారు. ఇక మేము చేసేదేమీ లేదంటున్నారు అధికారులు.పట్టణంలోని ఒక రహదారి దుస్థితి. చిన్న పాటి వర్షానికే ఇలా రహదారి అంతా బురదమయంగా మారింది. దీంతో కాలినడకన వెళ్లాలన్నా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇటువంటి చోట కొంత మేర మొరం వేసినచో బాటసారులకు, ద్విచక్రవాహనదారులకు ఇబ్బందులు దూరం అవుతాయి. ఖానాపూర్ వార్డులోని కాలనీల్లో గత వర్షాకాలంలో రహదారులపై పరిస్థితి ఇదీ. మురుగు కాలువల్లో నుంచి నీళ్లు ప్రవహించటానికి దారి లేక ఇలా అంతర్గత రహదారులపై ప్రవహించాయి. వరద నీరు చేరి ఇళ్లల్లోని నిత్యావసర సరకులు, దుస్తులన్నీ తడిసిపోయి ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
Tags: Rainy season troubles start …

