రాజమ్ మల్హోత్రా కన్నుమూత

Date:18/09/2018
ముంబై ముచ్చట్లు:
దేశ స్వాతంత్య్రం అనంతరం మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారిణి అన్నా రాజమ్ మల్హోత్రా కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. అన్నా రాజమ్‌ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు కేడర్ అధికారిణి, రిటైర్డ్ ఐఏఎస్ శాంత షీలా మాట్లాడుతూ.. ‘అన్నా రాజమ్ గొప్ప మహిళ.
నా రోల్ మోడల్. నన్ను ప్రశంసించిన సందర్భాలలో అన్నా రాజమ్‌లా చేశారని కొనియాడేవారని’ గుర్తుచేసుకున్నారు. సివిల్ సర్వీస్‌లో 1951లో చేరిన ఆమె మొట్టమొదటగా మద్రాస్‌ స్టేట్‌లో సేవలందించారు. అప్పటి సీఎం సీ. రాజగోపాలచారి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వ పలు శాఖల్లోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అన్నా రాజమ్ 1927 జూలైలో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జన్మించారు. కోజికోడ్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న అనంతరం మద్రాస్‌ వెళ్లి అక్కడ ఉన్నతవిద్యను అభ్యసించారు. ఆర్.ఎన్.మల్హోత్రాను ఆమె వివాహం చేసుకున్నారు.
మల్హోత్రా 1985 నుంచి 1990 వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్‌గా పనిచేశారు. సివిల్స్ ఇంటర్వ్యూలో ఆమెను ఫారిన్ సర్వీస్ లేక ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మహిళకు తగిన ఉద్యోగాలని సూచించగా.. సున్నితంగా తిరస్కరించిన అన్నా రాజమ్ ఐఏఎస్ గానే చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. గుర్రపు స్వారీ, షూటింగ్‌లోనూ అన్నా శిక్షణ పొందారు. ఆమె సర్వీసులో మొదటగా హోసూరు సబ్ కలెక్టర్‌గా చేశారు. ఆ సమయంలో ఓ గ్రామంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోన్న ఆరు ఏనుగులపై కాల్పులకు ఆదేశాలివ్వాలని ఒత్తిడి వచ్చినా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. గజరాజులను సురక్షితంగా అడవికి వెళ్లేలా చేశారు. 1982 ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ ప్రాజెక్టుకు ఇంచార్జ్‌గానూ సేవలందించారు.
Tags:Rajam Malhotra passed away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *