రజనీ వర్సెస్ విజయసాయిరెడ్డి
గుంటూరు ముచ్చట్లు:
విజయసాయిరెడ్డికి తత్వం బొధపడే పరిస్థితి వచ్చింది. వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పల్నాడు, బాపట్ల, ఒంగోలు జిల్లాల బాధ్యతలను ఆ పార్టీ సీఎం వైయస్ జగన్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో పల్నాడు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ చేస్తున్న పవర్ పాలిటిక్స్ అర్థమై షాక్ అయ్యారని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. దీంతో మంత్రి విడదల రజినీకి విజయసాయి గట్టిగానే క్లాస్ పికారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం.. గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని… దీంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొందటూ ఇప్పటికే ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికతో.. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి.. సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశాల సందర్భంగా మినిష్టర్ రజినీ పవర్ పాలిటిక్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజయసాయిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారని పార్టీ వర్గాల ద్వరా తెలుస్తోంది. విడదల రజినీ మంత్రి పదవి చేపట్టిన తర్వాత..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారనీ, నరసరావు పేట ఎంపీ, వైసీపీ నాయకుడు లావు కృష్ణదేవరాయులుని సైతం ఆమె లెక్క చేయకుండా.. వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా.. ఎంపీ కృష్ణదేవరాయులకు ప్రోటోకాల్ ఉండడం లేదని.. అలాగే నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీలో స్థానిక ఎంపీగా లావు కృష్ణదేవరాయలు పర్యటించాలంటే.. మంత్రి రజనీ అండ్ కో అనుమతి మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. దీంతో సదరు ఎంపీ చిలకలూరిపేట అసెంబ్లీ పరిధిలో పర్యటించడం దాదాపుగా మానేశార చెబుతున్నారు.రజినీ పవర్ పాలిటిక్స్‌పై గతంలోనే తాడేపల్లి ప్యాలెస్‌లోని పార్టీ పెద్దలకు ఆయన ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎంపీ లావు కృష్ణదేవరాయులు హార్ట్ అయ్యారనీ, పార్టీ మారే యోచన చేస్తున్నారనీ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఆయన సైకిల్ ఎక్కి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు రాజకీయ వర్గాలలో ఓ చర్చ నడుస్తోంది.

గుంటూరు ప్రస్తుత తెలుగుదేశంఎంపీ గల్లా జయదేవ్.. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పోటీ చేసే విషయంపై లావు కృష్ణదేవరాయులు దృష్టిపెట్టారన్న చర్చ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతోంది. ఈ నేపథ్యలోనే మంత్రి రజనీపై విజయసాయి ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై మంత్రి రజనీ కఠినంగా వ్యవహరిస్తున్నారని.. అంతేకానీ పార్టీకి ఎలాంటి చేటు తీసుకు రావడం లేదని…. అలాంటి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమేమిటంటూ రజనీ అనుచరులు విజయసాయిపై కారాలూ, మిరియాలూ నూరుతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న పై ఎన్నికల వేళ విజయసాయి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రజనీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎన్నికల ముంగిట రజనీ వర్సెస్ విజయసాయిగా గుంటూరు వైసీపీ రాజకీయం రంజుగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Tags:Rajani Vs Vijayasai Reddy
