12 ప్రాంతాల్లో రాజన్న రైతు బజార్లు

Date:10/11/2018
గుంటూరు ముచ్చట్లు:
ప్రజలకు తన స్వంతంగా సేవ చేయడంలో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందుంటారు. ఇప్పటికే ఆయన మంగళగిరిలో రూ.4 కే భోజనం పెట్టేందుకు రాజన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఇందుకోసం ఆయన స్వయంగా హైదరాబాద్ లో ఐదు రూపాయల భోజనం చేసి పరిశీలించి మంగళగిరిలో ప్రారంభించారు. ఈ క్యాంటీన్ స్థానికంగా పేదలకు, రోజు కూలీలకు బాగా మేలు జరుగుతోంది.
ఇప్పుడు తాజాగా ఆయన రూ.10 కే ఒక కుటుంబానికి వారం పాటు సరిపోయే కూరగాయలు అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన రాజన్న రైతు బజార్ ను ఇవాళ ఆయన మంగళగిరిలో ప్రారంభించారు. నియోజకవర్గంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే 12 ప్రాంతాల్లో ఈ రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్కే తెలిపారు.
వారం పాటు ఒక కుటుంబానికి సరిపోయే ఆకుకూరలు, కూరగాయలు కలిపి సుమారు 5 కిలోల కూరగాయలు రూ.10కే అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటుచేసి స్వంత నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ సంఘం మంగళగిరి ప్రాంతంలో కూరగాయలు పండించే రైతుల వద్దకు వెళ్లి సేకరించిన కూరగాయలు రాజన్న రైతు బజార్లలో విక్రయించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతులకు కూడా ట్రాన్స్ పోర్టు, దళారి కమిషన్ తప్పుతుందని పేర్కొన్నారు. ఇవాళ ప్రారంభించిన ఈ రాజన్న రైతు బజార్ లో కూరగాయలు తీసుకోవడానికి మహిళలు పెద్దఎత్తున వస్తున్నారు.
Tags: Rajanna farmer bazaars in 12 areas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *