Rajanna

కాసుల రాజన్న

Date:09/04/2018
రాజన్న  ముచ్చట్లు:
 పేదల పెన్నిధిగా.. కోరిన కోర్కెలు తీర్చి భక్తులకు కొంగుబంగారమయ్యారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయానికి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో దేవాలయ ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఆలయంలో వివిధ విభాగాలు, ప్రసాదాల విక్రయాల ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. భక్తుల రాకతోనే రాజన్న స్వామి ఆర్జన రూ.58.18కోట్లకు చేరినట్లు సమాచారం. ఇక మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆలయంలో వివిధ విభాగాలు, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.147 కోట్లు సమకూరాయని అంచనా. వాస్తవానికి రెండేళ్లుగా స్వామివారి ఆదాయం పెరుగుతూ వస్తోంది. పేదల దేవుడిగా పేరొందిన రాజన్నచెంతకు పేద భక్తులూ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారికి కానుకలు, నగదు సమర్పించుకుంటున్నారు. రాజన్న క్షేత్రానికి పర్వదినాలైన ఆది, సోమ, శుక్రవారాల్లో 50 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి, శ్రీరామనవమి, శివకల్యాణం లాంటి సందర్భాల్లో ఆలయం కిటకిటలాడిపోతుంది. లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. ప్రభుత్వం సైతం ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించింది. బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు కూడా చేస్తుండడంతో భక్తుల ఆదరణా పెరిగింది. సర్కార్ అభివృద్ధి చర్యల ఫలితంగానే రాజన్నకు స్థానికంగానే కాక పొరుగురాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం లభించింది.  రాష్ట్రం నుంచే కాకుండా చత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. భక్తుల సంఖ్య అధికమవుతుండటంతో గత పదేళ్లుగా స్వామివారి ఆదాయం పెరుగుతూనే ఉంది. గతేడాది రూ.51.58 కోట్లు సమకూరింది. ఈ సంవత్సరం రూ.6.60 కోట్ల పెరుగుదలతో రూ.58.18 కోట్లు ఆలయం ఆర్జించింది. హుండీ ద్వారా రూ.20.72కోట్లు సమకూరాయి. ప్రసాదం అమ్మకాలతో రూ. 1.76కోట్లు లభించాయి. కోడె మొక్కులతో రూ.8.65కోట్లు,  వసతి గదులు వల్ల రూ.2.74కోట్లు, టెండర్లు, అద్దె దుకాణాలు, తలనీలాలు, నిత్యకల్యాణాలు, నగదు డిపాజిట్లు, ఇతరత్రా పనుల వల్ల రూ.24.68కోట్లు సమకూరాయి. మొత్తంగా రాజన్న స్వామి ఆదాయం పెరగడంతో ఆలయ నిర్వాహకులతో పాటూ భక్తులూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
Tags:Rajanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *