Natyam ad

రాళ్లపల్లి వారికి సంగీత, సాహిత్యాల్లో సమప్రజ్ఞ

– అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ

– ఘనంగా శ్రీ అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి

– విగ్రహానికి ఘ‌నంగా పుష్పాంజలి

 

Post Midle

తిరుపతి ముచ్చట్లు:

 

సంగీతం, సాహిత్యంలో సమప్రజ్ఞ గల వాగ్గేయకారుడు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం రాత్రి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 45వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. విభీషణశర్మ మాట్లాడుతూ 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను శ్రీ రాళ్లపల్లివారికి టీటీడీ అప్పగించిందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారని తెలిపారు. శబ్దార్థాలపై నైపుణ్యం గల శ్రీ రాళ్లపల్లి లాంటి వారే అన్నమయ్య సంకీర్తనలను చక్కగా పరిష్కరించగలరని చెప్పారు. అన్నమయ్య సంకీర్తనల్లో గల సంగీతం, సాహిత్యంలోని మార్మికతను వారు అనుభవించి లోకానికి అందించారని వివరించారు. ప్రముఖ కవి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీ రాళ్లపల్లివారిని సాక్షాత్తు వ్యాసులవారితో పోల్చారని చెప్పారు.

 

అనంతరం శ్రీ రాళ్లపల్లి వారి మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త “శ్రీ రాళ్లపల్లివారి వైదుష్యం” అనే అంశంపై ప్రసంగించారు. శ్రీ రాళ్లపల్లి వారు దాదాపు రెండు వేల అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి గ్రంథస్తం చేశారని తెలిపారు. కృతులు సంగీతానికి, కీర్తనలు భక్తికి, పదములు సంగీత, సాహిత్యానికి ప్రధానమైనవని రాళ్లపల్లి వారు తెలియజేశారని వివరించారు.ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఎన్.సి.శ్రీదేవి “రాళ్లపల్లి వారి స్వీయ కృతులు” అనే అంశంపై ప్రసంగించారు. రాళ్లపల్లి వారి పలు కృతులను ఆలపించి అందులోని ఎత్తుగడలు, ఇతర విశేషాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Rallapalli have equal talent in music and literature

Post Midle