1000 కోట్లతో రామ్ కో సిమెంట్
Date:16/11/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రూ.1500 కోట్లతో రామ్కో సిమెంటు పరిశ్రమను త్వరలో నిర్మించనున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ అజ్మల్ తెలిపారు. మొదటి దశలో రూ.1000 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చేపడుతామన్నారు. అనంతరం రూ.500 కోట్లతో రెండవ దశ విస్తరణ పనులు జరుగుతాయన్నారు. 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించేలా ప్లాంటు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. పరిశ్రమ స్థాపన ద్వారా ఇక్కడి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, యువకులు, మేధావులతో గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ఆ గ్రామ కమిటీ సూచన మేరకు రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు, విద్యా, వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొలిమిగుండ్లలో 24 గంటలు అందుబాటులో ఉండేలా అధునాతన ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలుష్యం లేకుండా ఆధునిక, సాంకేతిక పద్దతుల్లో పరిశ్రమ నిర్మాణం జరుగుతుందన్నారు. స్థానికంగా అర్హులైన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిమెంటు పరిశ్రమకు అనుబంధంగా రూ.210 కోట్లతో రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ రైల్వేలైన్ ద్వారా కొలిమిగుండ్ల నుండి ఇతర ప్రాంతాలకు ప్యాసింజర్ రైళ్లు నడిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. సిమెంటు పరిశ్రమ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
Tags:Ram Co cement with Rs 1000 crore