రామ్ నారాయణరెడ్డి…రాం..రాం

Ram Narayana Reddy ... Ram..Ram
Date:19/05/2018
నెల్లూరు ముచ్చట్లు:
కొన్నాళ్లుగా ఈ అంశం మీద వార్తలు వస్తూనే ఉన్నాయి… ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడవచ్చు అనే మాట కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో పరిణామాల పట్ల ఆయన అసహనంతో ఉన్నారని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి చేరే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో వైసీపీ నేతలతో ఆనం రామనారాయణ రెడ్డి చర్చలు కూడా జరుగుతున్నాయని కొన్నాళ్ల కిందట పత్రికలు పేర్కొన్నాయి. అయితే అంతలోనే ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి మరణించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు రామనారాయణ రెడ్డికి సర్ధి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అదలా ఉంటే.. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మినీ మహానాడులో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడిన తీరును చూస్తుంటే ఈయన తెలుగుదేశం పార్టీని వీడవచ్చు అనే ఊహాగానాలకు మళ్లీ ఊపు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో తను తీవ్రమైన అవమానాలను ఎదుర్కొంటున్నాను అని ఆనం అన్నారు. తన జీవితంలో ఇలాంటి అవమానాలు ఎప్పుడూ ఎదుర్కొనలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే బాబు పాలనపై 80 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉన్నారనేది కూడా అబద్ధమే అని ఆనం వ్యాఖ్యానించారు. వ్యవసాయ శాఖామంత్రి నెల్లూరు జిల్లా వ్యక్తే అయినా ఈ జిల్లాలోని రైతుల సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని ధ్వజమెత్తారు. ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి హోదాలో పలు సమస్యల గురించి చంద్రబాబుకే విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలోనే రామనారాయణ రెడ్డి ఇలా మాట్లాడటంతో పార్టీని వీడటానికి సిద్ధపడే తెగించి ఉండవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:Ram Narayana Reddy … Ram..Ram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *