Date:24/04/2020
చిత్తూరు ముచ్చట్లు:
కరోనా వైరస్ కట్టడిలో రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతోంది. రంజాన్ నెల ప్రారంభం అంటే ముస్లింలు వారం ముందు నుంచే ఉపవాస దీక్షకు సిద్ధం అవుతారు. కఠోరమైన ఈ ఉపవాస దీక్షను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాటిస్తారు. అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం 5 పూటల నమాజు, రాత్రి తరావీహ్ ప్రత్యేక నమాజు తప్పనిసరిగా చేస్తారు. అయితే కరోనా వైరస్ కనికరం లేకుండా మానవాళిపై దాడి చేసి ప్రాణాలను హరిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని మతాలకు చెందిన పుణ్యక్షేత్రాలు మూతపడ్డాయి. పూజలు, ప్రార్థనలు ఆగిపోయాయి. నేపథ్యంలో రేపటినుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసం ఇళ్లకే పరిమితం అయింది. ఉపవాస దీక్షలు, నమాజు ఇళ్లలోనే జరుపుకోనున్నారు. దానధర్మాలకు, మసీదుల్లో ప్రార్థనలకు కొన్ని నిబంధనలు సడలించినప్పటికీ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు జరగవు. ఈ పరిస్థితుల్లో రంజాన్ మాసం సందడి లేకుండా జరుపుకోనున్నారు. ఈ నెలంతా మసీదులు కిటకిటలాడేవి. ఇప్పుడు బోసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ కలగలేదు. కరోనా వైరస్ దెబ్బకు మానవాళి విలవిలలాడుతోంది. ఇందుకు అందరూ బాధితులే. ఈ రంజాన్ మాసం ముస్లింలకు ఇలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ప్రశాంతంగా ముగి యాలని తెలుగు ముచ్చట్లు ప్రార్థిస్తోంది.
Tags: Ramadan at Corona Strip