రామనామమే…శిరోధార్యం

Date:13/08/2020

లక్నో ముచ్చట్లు:

వారు ఊహించిందే జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి విజయం సాధించాలంటే రామజపమే ముఖ్యమన్నది కమలనాధులకు తెలియంది కాదు. అందుకే అయోధ్య అంశంగానే కమలనాధులు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అయోధ్యలో రామమందిర నిర్మాణానిక భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే.అయితే అయోధ్యలోనే మసీదు ప్రారంభానికి ఆహ్వానిస్తే వెళతారా? అన్న ప్రశ్నకు యోగి ఆదిత్యానాధ్ లేదనే ఖరాఖండీగా చెప్పారు. తాను మసీదు ప్రారంభోత్సవానిక వెళ్లనని ఆయన తెలిపారు. ఇప్పుడు ఇది ఉత్తర్ ప్రదేశ్ లో చర్చనీయాంశమైంది. సమాజ్ వాదీ పార్టీ దీనిపై మండిపడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేశారని యోగి ఆదిత్యానాధ్ ను సమాజ్ వాదీ ప్రశ్నించింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నిలదీసింది.నిజానికి ఉత్తర్ ప్రదేశ్ లో మతం కంటే కులాల కుంపట్లు ఎక్కువగా ఉన్నాయి. యాదవ సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, మైనారిటీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.

 

ఇప్పటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కులాల ప్రాతిపదికనే అధికారంలోకి వస్తున్నాయి. వారి ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు యోగి ఆదిత్యానాధ్ కులాల స్థానంలో మతానికి ప్రాముఖ్యత నిచ్చేలా వ్యాఖ్యలు చేశారు.హిందువులందరినీ కులాలకతీతంగా ఏకం చేయడానికి యోగి ఆదిత్యానాధ్ వ్యాఖ్యలు ఉపయోగ పడతాయన్న భావనలో కమలదళం ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో హిందువుల్లో అధిక భాగం రామాలయ నిర్మాణాన్ని కోరుకుంటున్నారు. అది సాఫల్యం కావడం ఒక ఎత్తైతే, తాను మసీదు ప్రారంభానికి వెళ్లనని చెప్పడం హిందువులను మరింత దగ్గర చేర్చుకునే ప్రయత్నమే అంటున్నారు. విపక్షాలు కూడా ఈ అంశాన్ని ఎంత రాద్ధాంతం చేయకుంటే అంత మంచిదన్న భావనలు కూడా ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తుండటం విశేషం. మొత్తం మీద యోగి ఆదిత్యానాధ్ హిందువులను ఏకతాటిపైకి రప్పించేందుకు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నాటికి అనుకూలిస్తాయో? లేదో చూడాల్సి ఉంది.

 

 

 టెస్టింగ్ కిట్లలో మాయాజాలం

Tags:Ramanamame … sirodharyam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *