Tamilsai as a boon to Kamalani

కమలం గూటికి రమేష్ 

Date:28/11/2020

అదిలాబాద్ ముచ్చట్లు:

తెలుగుదేశంలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. దశాబ్ద కాలం ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను శాసించిన లీడర్. కానీ వరుస పరాజయాల ఢక్కామొక్కీలతో అదే పనిగా కండువాలు మార్చేశారు. ఇప్పుడాయన కాంగ్రెస్. అయితే, కమలం గూటికి వెళితే తప్ప, తనకు ఫ్యూచర్‌ లేదని డిసైడయ్యారట. కాంగ్రెస్‌లో ఎవరికీ కాలాడటం లేదు. సొంత పార్టీలో వుండలేక, అవతలిపార్టీలోకి వెళ్లేందుకు దారి లేక, సతమతమవుతూ, తెగ బేజారైపోతున్నారట ఖద్దరు నేతలు. ఇందులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా ఒకరన్న చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, స్థానిక సంస్థల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాయకుడు. జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. ఒక దశాబ్దం పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను శాసించారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి, టిఆర్ఎస్ అభ్యర్థి నగేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో, టీఆర్‌ఎస్ ఖానాపూర్ టికెట్ దక్కదని భావించి, వెంటనే కాంగ్రెస్‌ గూటికి చేరారు రమేష్ రాథోడ్. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు.

 

 

 

మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి, బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు. వరుస ఓటములతో రమేష్ రాథోడ్ రాజకీయ జీవితం తలకిందులైనట్టయ్యింది. ఇక కాంగ్రెస్‌లోనే వుంటే, పొలిటికల్ లైఫ్‌కు చరమగీతమేనని టెన్షన్ పడుతున్న రాథోడ్, కమలం గూటికి చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. దానిలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సంప్రదింపులూ జరిపారట. గతంలో తనతో పాటు ఎంపీగా పని చేసిన టీడీపీ ఎంపీలు కూడా, బీజేపీలోనే వుండటంతో, వారి ద్వారా కూడా చక్రం తిప్పారట రమేష్ రాథోడ్. ఇక కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్‌ను వీడి, కమలం గూటికి చేరడమేనని చర్చ జరుగుతున్న నేపథ్యంలో, రమేష్‌ రాథోడ్‌కు అసలు అడ్డంకి ముందరికాళ్లకు బంధనం వేస్తోందట.  బిజెపిలో రమేష్ రాథోడ్ చేరికపై తెలంగాణ కమల దళపతి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అభిప్రాయాన్ని అడిగారట. ఎట్టి పరిస్థితుల్లోనూ రాథోడ్, బీజేపీలోకి రావడానికి వీల్లేదని ఖరాకండిగా చెప్పేశారట సోయం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదివాసీల ఓటర్లు లక్షల సంఖ్యలో ఉన్నారన్న సోయం, వారి ఓట్ల వల్లనే నియోజకవర్గంలో విజయం సాధించామని చెప్పారట.

 

 

అలాంటిది, ఆదివాసీలతో ఏమాత్రం పొసగని రమేష్ రాథోడ్‌ను పార్టీలోకి ఎలా రానిస్తారని అన్నారట. ఇదే జరిగితే ఆదివాసీలు బీజేపీకి దూరమయ్యే ప్రమాదముందని సంజయ్‌తో చెప్పారట. పైగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసీలను వ్యతిరేకించే రాథోడ్‌ను పార్టీలోకి తీసుకుంటే, పార్టీకే నష్టమని సంజయ్‌కు వివరించారట బాపు.  ఇవేకాదు, మరిన్ని కారణాలు కూడా రాథోడ్‌ రాకకు అడ్డంకులుగా వున్నాయి. రాథోడ్ వస్తే, తన స్థానానికే ఎసరుపెడతారని సోయం బాపురావు ఆందోళన అట. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుగా, బాపురావు, రాథోడ్‌లు ఏ రకంగానూ ఒకే పార్టీలో వుండలేరని స్థానిక కార్యకర్తలు సైతం అంటున్నారట. ఇలా సవాలక్ష సమస్యల నేపథ్యంలో, రాథోడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నారట బీజేపీ పెద్దలు. అయినప్పటికీ,

 

 

 

బిజెపిలో చేరడం ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారట రాథోడ్ రమేష్. ఢిల్లీ పెద్దలతో తనకున్న సన్నిహిత సంబంధాలతో బిజెపిలో చేరుతారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారట. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఖానాపూర్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తారని మాట్లాడుకుంటున్నారట. కానీ మెజారిటీ వర్గమైన తమను కాదని, రాథోడ్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆదివాసీ కార్యకర్తలు అంటున్నారట. మొత్తానికి బలాన్ని చేకూర్చాల్సిన చేరికలు, ముందే కుంపట్లను రాజేస్తున్నాయి. చూడాలి, చివరికి ఏమవుతుందో.

అమలుకు దూరంగా ఈ సర్వీసెస్

Tags: Ramesh to Kamalam Gooty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *