రైతుబీమాకు ‘జన్‌ధన్‌’ చిక్కు

Date:17/07/2018
నల్గొండ ముచ్చట్లు:
రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలుచేస్తోంది. మొదట్లో ఈ పథకానికి అర్హతల విషయంలో సందిగ్ధత చోటుచేసుకుంది. కొత్త పట్టాదారు పాసు పుస్తకం ఉంటేనే పేరు నమోదు చేయాలని తొలుత ఆదేశాలు వచ్చాయి. దీంతో పాసుపుస్తకాలు అందని రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రైతుబంధు సాయం అందుకున్న ప్రతిరైతుకు బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈమేరకు లబ్ధిదారుల వివరాలతో పాటు నామినీ వివరాలు సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నామినీ ఖాతాలు ఉమ్మడి జిల్లాలో 45 శాతానికి పైగా జన్‌ధన్‌ ఖాతాలున్నాయి. వీటితో మరో సమస్య ఎదురుకానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జన్‌ధన్‌ పథకంలో ఇచ్చిన బ్యాంకు ఖాతాలన్నీ శూన్య నిల్వ ఖాతాలే. వీటిలో పరిమితికి మించి నగదు నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రిస్థాయిలో బ్యాంకర్లతో సమావేశమైనా సమస్య కొలిక్కి రాలేదు. ఈ ఖాతాల విషయమై స్పష్టత రాకుంటే రాబోయే కాలంలో బాధిత కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.నల్గొండ జిల్లాలో 4,05,684 చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 3,70,684 మాత్రమే అందజేశారు. వీరిలో రెండు లేదా అంత కంటే ఎక్కువ చెక్కులున్న రైతులు ఏడు వేల మంది ఉన్నారు. ఇప్పటివరకు 2,43,227 మంది రైతుల వివరాలే ఏఈవోలు సేకరించగలిగారు. 1,62,663 దరఖాస్తులను ఇంటర్నెట్ లో నమోదు చేశారు. అయితే వీరిలో 43,526 మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం. ఇంకా 85 వేల మంది రైతుల వివరాలు సేకరించాల్సి ఉంది. అయితే వీరిలో సగానికి పైగా స్థానికంగా అందుబాటులో లేరని అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు వివరాలు సమర్పించిన రైతుల్లో 45 శాతం మందికి జన్‌ధన్‌ ఖాతాలున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జన్‌ధన్‌ ఖాతాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏడాది సమయంలో ఖాతాలో రూ.లక్షకు మించి లావాదేవీలు చేయకూడదు. ఒక్క నెలలో రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా చేసే ఛాన్స్ ఉంది. పైగా ఖాతాలో రూ.50 వేలకు మించి నగదు ఉంచకూడదు. అయితే.. రైతుబీమా మొత్తం అధికం. బాధిత కుటుంబాలకు చేరాల్సిన ఈ మొత్తం ఎక్కువగా ఉండడంతో జన్‌ధన్‌ ఖాతాలు పనికిరావని సమాచారం. ఏదేమైనా ఈ సమస్య త్వరితగతిన పరిష్కృతమై అర్హులైన రైతులందరికీ బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని అంతా ఆశిస్తున్నారు.
రైతుబీమాకు ‘జన్‌ధన్‌’ చిక్కుhttps://www.telugumuchatlu.com/ranethas-janardhan-riddles/
Tags: Ranetha’s ‘Janardhan’ riddles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *