పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గా రంగనాయక సాగర్ ప్రాజెక్టు

కరీంనగర్  ముచ్చట్లు:
పొలిటికల్ టూరిజానికి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కేంద్ర బిందువుగా మారింది. ఇంతకీ పొలిటికల్ టూరిజం ఎంటనేగా మీ సందేహం.. మీ అనుమానం నిజమే.. జలకళని సంతరించుకున్న రంగనాయక సాగర్ పర్యాటకులకే కాదు. రాజకీయ నాయకులకు వేదికైంది. సిద్దిపేట జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుండే రాజకీయ నాయకులు హుజురాబాద్ ఎన్నికల చక్రం తిప్పుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు చాలా ప్రత్యేకత ఉంది. అన్ని ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా ఇదొక ఐలాండ్‌ను తలపిస్తుంది. చుట్టూ నీరు.. నీటి మధ్యలో కొండ.. దానిపై ఇరిగేషన్ ఆఫీస్… అతిథి గృహం. ఇక్కడి నుండి ఎటూ చూసిన పచ్చదనం.. చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రస్తుతం రంగనాయకసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. రోజువారీగా చూస్తే ఒక్క హుజురాబాద్ నియోజక వర్గం నుండే 10 నుంచి 15 కార్లు, నాలుగైదు బస్సుల్లో జనం వచ్చి రంగనాయక సాగర్‌ను తిలకిస్తున్నారు. వీరికి అతిధి గృహంలో విందు భోజనం సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వినికిడి. దీన్ని చూసిన స్థానిక ప్రజలు ఎన్నడూ లేనిది ఒక్కసారిగా హుజురాబాద్ నుండి ఇంత పెద్ద జనం రావడం ఏంటి… వీరు నిజంగానే పర్యాటకులా… పార్టీ నాయకులా అంటూ ముచ్చటించుకుంటున్నారు.రంగనాయక సాగర్ ప్రాజెక్టు అతిధి గృహంలో అధికార పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రోజు పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేసేలా రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై నిన్న పెద్ద సంఖ్యలో వాహనాలు కన్పించాయి. సుమారు ఇరవై వరకు కార్లు, నాలుగైదు బుస్సులు రంగనాయకసాగర్ కట్టపై కనిపించాయి. వీటిలో కొన్ని కార్లకు టీఆర్ఎస్ జెండాలు కన్పించడం మరింత బలాన్ని చేకూర్చింది. అయితే కొందరు టీఆర్ఎస్ నాయకులు దీన్ని ఖండించారు. వారంతా రంగనాయక సాగర్ ప్రాజెక్టును చూడటానికి వచ్చారని సమాధానమిచ్చారు. కేవలం వారంతా పర్యాటలకులే అని చెప్పుకొచ్చారు. కానీ వారి కార్లకు గులాబీ జెండాలుండటాన్ని బట్టి వీరు ఖచ్చితంగా పార్టీ నాయకులేనని, హుజురాబాద్ ఎన్నికల్లో భాగంగానే వీరు ఇక్కడకు వచ్చారని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.ఎన్నికల ప్రచార శైలిలో అధికార పార్టీ రూటే వేరు. పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలకు ఉత్సహపరిచేలా వారికి మందు, విందు భోజనాలు ఏర్పాటు చేస్తుందని ఆది నుంచి అధికార పార్టీపై ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా హుజురాబాద్ ఉపఎన్నికలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. మంచి పర్యాటక స్థలంగా పేరొందిన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ పై హుజురాబాద్ నాయకులు తిష్ట వేస్తున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక వాహనాల్లో రంగనాయక సాగర్ కట్ట మీదకు చేరుకుంటున్నారు. వీరికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికి.. కట్ట అందాలను వివరిస్తూ అతిథి గృహంలో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. కట్ట అందాలను వీక్షిస్తున్న హుజురాబాద్ ప్రజలు సిద్దిపేట చాలా అభివృద్ధి చెందిందంటూ ముచ్చటించుకుంటున్నారు. ఆ తర్వాత హుజురాబాద్‌లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతి వ్యూహాలపై చర్చించి, ఎవరెవరూ ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి.. ప్రత్యర్థి పార్టీపై ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధించాలి. ఇలా పలు అంశాలపై చర్చించి, పార్టీ నాయకులకు టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మార్గనిర్దేశనం చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి హుజురాబాద్ ఎన్నికల పుణ్యమా అని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌కు మరింత పర్యాటక శోభ సంతరించుకుంది.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Ranganaika Sagar project as a carafe address to parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *