రంగారెడ్డి బీజేపీలో రచ్చకెక్కిన విబేధాలు

Date:17/03/2018
వికారాబాద్ ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కలహాలతో కూడిన కమలం పార్టీగా తయారైంది. ఒక్కో నియోజకవర్గంలో నాలుగైదు గ్రూపులు నిర్వహిస్తూ ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కూడా లెక్కచేయని పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీలో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ గ్రూపు రాజకీయాలతో నామమాత్రంగా ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేవలం కుల్కచర్ల మండలానికే పరిమితం కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం సాధారణ ఎన్నికలు సమీస్తుండడంతో గ్రూపు రాజకీయాలు మరింత పెరిగాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో టికెట్‌ను ఆశిస్తున్న ఆశావాహులు ఎవరికి వారు పార్టీ అధిష్టానం వద్ద పైరవీలు మొదలుపెట్టారు. పరిగి నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడినే ఎన్నికల బరిలో దింపే ఆలోచనలో ఉండగా, కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం ఒకరిద్దరు చోటా లీడర్లు తప్ప అస్సలు క్యాడరే లేని పరిస్థితి ఉంది. మరోవైపు వికారాబాద్ నియోజకవర్గంలో ఇద్దరు టికెట్ ఆశిస్తుండగా, తాండూరు నియోజకవర్గంలోనూ ఇద్దరు ఆశావాహులు తమకే టికెట్ వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో కమలం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందంటే కార్యకర్తల కంటే నేతలే ఎక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది. జిల్లా బీజేపీలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడిది ఓ గ్రూపు, జిల్లా ప్రధాన కార్యదర్శిది ఓ గ్రూపు, నియోజకవర్గ ఇన్‌చార్జీలది మరో గ్రూపుగా బీజేపీ పరిస్థితి తయారైంది. ప్రధానంగా జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీకి వింత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న ఇద్దరు గ్రూపులు సెపరేట్‌గా ఉండగా, వీరికి తోడు మరో నాలుగైదు గ్రూపుల మధ్య వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారం కొనసాగుతుంది. సంబంధిత నియోజకవర్గంలో శివరాజ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి వర్గం ఓ గ్రూపుగా వ్యవహరాలను నడిపిస్తుంటే, మాధవరెడ్డి, కేపీ రాజు మరో గ్రూపుగా ఉన్నారు. మరోవైపు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పాండుగౌడ్ వర్గం మరో గ్రూపుగా తయారై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూపుల్లోలేని మిగతా వారంతా జిల్లా అధ్యక్షుడి మద్దతుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అస్సలు క్యాడర్ లేకపోవడంతో వెలవెలబోతున్న ఆ పార్టీకి ఈ గ్రూపు రాజకీయాలు మరో తలనొప్పిగా మారింది. తాండూరు టికెట్ ఆశిస్తున్న రమేశ్‌కుమార్, రవిశంకర్ పటేల్‌లు గ్రూపు రాజకీయాలకు తెరతీసి, ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికీ వారు పార్టీ కార్యాలయాలను వేరువేరుగా ఏర్పాటు చేశారంటే ఆ పార్టీ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎవరున్నా వారి ఆదేశానుసారం పార్టీ వ్యవహారాలు కొనసాగేవి. అయితే జిల్లా ఏర్పాటైన అనంతరం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కరణం ప్రహ్లద్‌రావు మాత్రం నామమాత్రపు జిల్లా అధ్యక్షుడిగా అయ్యారు. ఆ పార్టీలో జిల్లా అధ్యక్షుడ్ని పట్టించుకునే వారేలేకపోవడం గమనార్హం. తొలుత జిల్లా అంతటా బీజేపీ కార్యక్రమాలకు హాజరైన ఆయన ఎవరూ అంతగా పట్టించుకోకపోవడం, వారి గ్రూపు రాజకీయాలకే ప్రాధాన్యమివ్వడంతో కుల్కచర్ల మండలానికే పరిమితమయ్యారు. జిల్లాలో అంతంతే ఉన్న బీజేపీలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు మాత్రం అధికంగానే ఉన్నారు. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో బరిలో దిగిన డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరేసి టికెట్ ఆశిస్తుండడం విచిత్రం. జిల్లాలోని పరిగి నియోజకవర్గం నుంచి ఒక్కరు మాత్రమే టికెట్‌ను ఆశిస్తున్నారు. టికెట్‌ను ఆశిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు సంబంధిత నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు ఆశావాహులు ఎవరూ లేకపోవడం గమనార్హం. మిగతా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో మాత్రం ఇద్దరేసి ఆశావాహులు టికెట్‌ను ఆశిస్తూ ఆ పార్టీ అధిష్టానం వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికి వారు ముఖ్య నేతల వద్ద టికెట్‌కై లాబీయింగ్ చేస్తున్నారు. జిల్లాలోని తాండూరు నియోజకవర్గం నుంచి రమేశ్‌కుమార్, రవిశంకర్ పటేల్ ఇద్దరు బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే రమేశ్‌కుమార్ ముందు నుంచి పార్టీలో పనిచేయడంతోపాటు సంబంధిత పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్య నేతలతోపాటు జిల్లా ముఖ్య నేతల అండ ఉన్నట్లు తెలుస్తుంది. రమేశ్‌కుమార్‌యే బరిలో దిగుతారని స్పష్టంకావడం, ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటినుంచో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుండడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా రమేశ్‌వైపే ఉన్నట్లు సమాచారం. అయితే సరిగ్గా ఆర్నెళ్ల క్రితం వరకు తాండూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఒక్కరే బరిలో ఉంటారని అనుకున్నప్పటికీ ఆ సమయంలో ఎన్‌ఆర్‌ఐ రవిశంకర్ పటేల్ కూడా తాండూరు నియోజకవర్గం నుంచి టికెట్‌కై పెద్దఎత్తున లాబీయింగ్ చేయడం మొదలు పెట్టారు. ఎన్‌ఆర్‌ఐ అయిన రవిశంకర్ పటేల్‌కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అండదండలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ ముఖ్య నేతలందరూ రమేశ్‌కే మద్దతు తెలుపుతున్నప్పటికీ ఎవరు బరిలో దిగనున్నారనే దానిపై అటు ఆశావహుల్లోనూ, ఆ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.మరోవైపు వికారాబాద్ నియోజకవర్గంలోనూ ఇద్దరు వ్యక్తులు టికెట్‌ను ఆశిస్తున్నారు. రిటైర్డ్ ఏఎస్పీ సాయికృష్ణతోపాటు ఓ ప్రైవేట్ పాఠశాల యజమాని నవీన్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యనేతల నుంచి హామీ ఉందని సాయికృష్ణ చెబుతున్నప్పటికీ ఆయనకు నియోజకవర్గంలోని స్థానిక నేతలెవరూ మద్దతివ్వకపోవడంతో డీలా పడిపోయారు. వీరిద్దరు ఎవరికి వారు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ వీరిద్దరికి ఆ పార్టీ స్థానిక నేతలు మద్దతివ్వడంలేదని సమాచారం. వికారాబాద్ నియోజకవర్గంలోని నాలుగైదు గ్రూపులకు సంబంధించిన ఏ ఒక్కరూ కూడా వీరిద్దరికి మద్దతివ్వడంలేదని తెలుస్తుంది. వీరిద్దరికి పెద్దగా పట్టులేకపోవడం తదితర కారణాలతో ఎన్నికల సమయానికి కొత్త వ్యక్తి బరిలో దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్‌కు ఒకవేళ కాంగ్రెస్ నుంచి టికెట్ రానట్లయితే బీజేపీ నుంచి అయిన బరిలో దిగే యోచనలో ఉన్నట్ల విశ్వసనీయ సమాచారం.
Tags: Rangareddy’s disagreements in the BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *