తొలిసారిగా ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైళ్లు

Date:26/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్ల రాక ప్రయాణాన్ని చాలా సులభతరం చేసింది. ఈ ఉత్సాహంతో మోదీ ప్రభుత్వం బుల్లెట్ రైలు మార్గం నిర్మాణాన్ని చేపట్టింది. తాజాగా దేశవాసులకు మరో రకమైన రైలును పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. యూకే, జపాన్ లాంటి దేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైళ్లను తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ రైలుకు సంబంధించిన తొలి డిజైన్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ విడుదల చేసింది.ఢిల్లీ – గజియాబాద్‌ – మీరట్‌ ప్రాంతాలను కలుపుతూ తొలి ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) రైలు మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. దేశ రాజధాని ప్రాంతం (NCR) వెంట ఆర్‌ఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ఎన్‌సీఆర్‌టీసీ పేరుతో జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు మార్గం నిర్మాణాన్ని ఈ కంపెనీ పర్యవేక్షిస్తుంది.

 

 

ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైళ్లు వస్తే.. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. తొలుత 82 కిలోమీటర్ల మేర ఈ రైలు ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ అత్యాధునిక రైళ్ల ద్వారా ప్రయాణ సమయం మూడో వంతుకు తగ్గనుంది. ఢిల్లీ, మీరట్ నగరాల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 3, 4 గంటల సమయం పడుతుండగా.. ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే, గంట లోపే గమ్యాన్ని చేరుకోవచ్చు.గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లతో ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌ దేశంలో ఇదే మొదటిది కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందే ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో నిర్మాణమై ఉంటాయి. బరువు తేలిక. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు పూర్తిగా ఏసీ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. వైఫై లాంటి ఇతర సదుపాయాలు ఉంటాయి.ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ తొలి దశ ట్రాక్ నిర్మాణాన్ని 2023 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2025 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటుటోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

సెప్టెంబర్ 25…చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు బ్లాక్ డే

Tags: Rapid transit system trains for the first time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *